పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్​ నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 144 సెక్షన్​ అమలులో ఉందన్నారు.

జూన్​ 6 వరకు ఎన్నికల రూల్స్ అమలులో ఉంటాయన్నారు.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు డివిజన్​ పరిధిలో 10 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డివిజన్​లో గ్రాడ్యుయేట్ ఓటర్లు 8543 మంది ఉన్నారన్నారు. ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయనవెంట నాయబ్ తహసీల్దార్​ విజయ్​కుమార్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ అర్జున్​, రెవెన్యూ ఆఫీసర్లు పాల్గొన్నారు.