కరీంనగర్ క్రైం, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఓ ఉద్యమకారుడు కరీంనగర్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లికి చెందిన కుక్క మల్లయ్య(58) తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చేంతవరకు కొట్లాడిన తాను అన్ని విధాలా నష్టపోయానని, ఇప్పటివరకు తనను ఎవరూ ఆదుకోలేదంటూ మదనపడుతున్నాడు.
రెండు రోజుల కింద ఇంట్లో కూడా ఈ విషయమై గొడవ జరిగినట్టు తెలిసింది. ‘ఉద్యమంలో కొట్లాడిన వాళ్లకు కళాకారులుగా ఉద్యోగాలు వచ్చినయ్...పెన్షన్లు తీసుకుంటున్నరు. నువ్వు తెలంగాణ..తెలంగాణ అని కొట్లాడినవ్ కదా...ఏం సాధించినవ్..ఏ సంపాదించివన్’ అని ఇంట్లో మందలించినట్టు తెలిసింది. దీంతో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర పురుగుల మందు తాగాడు. స్థానిక ఆటో డ్రైవర్లు గమనించి అతడిని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.