ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ భవితకు పునాది కార్యకర్తలే

మెదక్​ (చేగుంట), వెలుగు : బీజేపీ భవితకు పునాది కార్యకర్తలేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శనివారం చేగుంట మండల కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంకిత భావంతో, సిద్ధాంతానికి కట్టుబడి, కష్టపడి పని చేసే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని తెలిపారు. టీఆర్ఎస్​ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఎప్పటికప్పుడు కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండి, పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్లు, బ్రిడ్జిలు, సీసీ రోడ్లు తదితర పనులను ప్రజలకు వివరించాలన్నారు. అక్కన్నపేట మెదక్, మనోహరాబాద్ గజ్వేల్, సిద్దిపేట రైల్వే లైన్లు మోడీ ప్రభుత్వ హయాంలోనే  జరిగాయన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకునేలా కార్యకర్తలు చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి, జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి, జిల్లా ఇన్​చార్జి మల్లారెడ్డి, పార్లమెంటు కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, మాజీ జిల్లా చైర్మన్ బాలయ్య, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

‘ప్రజలను మోసం చేస్తున్న టీఆర్​ఎస్​’

పటాన్​చెరు, వెలుగు : తెలంగాణ ఉద్యమ నాటి నుంచి నేటి వరకు ప్రజలను టీఆర్​ఎస్​ మోసం చేస్తూనే ఉందని మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మండిపడ్డారు. శనివారం పటాన్​చెరు పట్టణ పరిధిలోని పద్మావతి ఫంక్షన్​ హాల్​లో సంగారెడి జిల్లా అధ్యక్షుడు నరేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడగానే దళితుడిని సీఎం చేస్తానని, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అని, నిరుద్యోగ భృతి, తదితర హామీలు ఇచ్చి అమలు చేయకుండా కేసీఆర్​ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణలో పబ్బు కల్చర్, డ్రగ్స్ కల్చర్, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్​ మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగేలా చేస్తూ రాష్ట్రాన్ని నష్టాల ఊబిలోకి తోస్తున్నారన్నారు. ఎన్నికల ముందు టీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ ఇన్​చార్జి అట్లూరి రామకృష్ణ, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, కార్యవర్గ సభ్యుడు రాజేశ్వరరావు దేశ్​ పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జహీరాబాద్, వెలుగు : తెలంగాణలో బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కర్ణాటకలోని బసవ కళ్యాణ్ కు వెళ్తున్న క్రమంలో జహీరాబాద్ లో బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బూత్​ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ రెడ్డి, సుధీర్ కుమార్, పొద్దుటూరి శ్రీనివాస్, సుధీర్ బండారి తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్​ హయాంలో పల్లెల అభివృద్ధి

మునిపల్లి, (కోహీర్​) వెలుగు :  టీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు అభివృద్ది చెందుతున్నాయని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు అన్నారు. కోహీర్ మండలంలోని గొటిగర్​ పల్లి, పర్శపల్లి, కొత్తూర్ కె, ఖానాపూర్ గ్రామాల్లో  సీసీ రోడ్డు పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్​ శకుంతల తుక్కప్ప ముదిరాజ్,  ఎస్సీ విజిలెన్స్ బోర్డ్ మెంబర్​ బంటు రామకృష్ణ ,  ఎంపీఓ  వెంకట్ రెడ్డి,  నాయకులు పాల్గొన్నారు.  

పట్టుదలతో ఉద్యోగం సాధించాలి

జహీరాబాద్, వెలుగు :  పట్టుదలతో కష్టపడి ఉద్యోగం సాధించేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం జహీరాబాద్ లోని బాగారెడ్డి స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల కోసం  ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆయన గుడ్లు, పాలు అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ రఘు, సీఐ తోట భూపతి, ఎస్సై శ్రీకాంత్, నాయకులు ఉన్నారు. 

బాలికలకు ఉన్నత విద్య అందించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు :  బాలురతో సమానంగా బాలికలకు తల్లిదండ్రులు ఉన్నత విద్యను అందించాలని జూనియర్ సివిల్ జడ్జి సల్మా ఫాతిమా సూచించారు. శనివారం నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది లో వరకట్న నిషేధంపై  జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. వరకట్న నిషేధ చట్టం వచ్చినప్పటికీ తల్లిదండ్రులు కట్నం గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దన్నారు. వరకట్నం గురించి ఎవరు హింసించినా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.  మహిళాలందకే చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతకుముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఫొటోకు పూలమాలలు వేశారు.  కార్యక్రమం లో ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీశ్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, న్యాయవాదులు బాలయ్య, ప్రకాశ్, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, కో ఆపరేటివ్ వైస్ చైర్మన్​ సత్తయ్య, ఎస్సై శివానందం, మాజీ ఎంపీటీసీ ముత్యం, పంచాయతీ సెక్రటరీ అరుణ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మెదక్​ (పెద్దశంకరంపేట), వెలుగు :  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని బేగరిగల్లి,  ఉప్పరిగల్లి, మాధవనగర్ కాలనీలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన రాజ్యాంగ అవతరణ దినోత్సవ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీపీ జంగం శ్రీనివాస్,  తహసీల్దార్ చరణ్ సింగ్,  ఎంపీడీవో రఫీ హుస్సేన్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ,  రైతుబంధు అధ్యక్షుడు సురేశ్​గౌడ్,  మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు తదితరులు ఉన్నారు. 

కంప్యూటర్ సర్టిఫికెట్ల అందజేత 

నారాయణ ఖేడ్, వెలుగు : తెలంగాణ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 45  రోజుల పాటు వివిధ కోర్సుల్లో కంప్యూటర్ ట్రైనింగ్ పూర్తి చేసిన స్టూడెంట్లకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శనివారం క్యాంపు కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. కంప్యూటర్ స్కిల్స్ సాధించిన ప్రతి స్టూడెంట్ మంచి జాబ్ సంపాదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ట్రైనర్ జైపాల్, జడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి, తడ్కల్ సర్పంచ్ మనోహర్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు అంజా గౌడ్  పాల్గొన్నారు.

సీఎస్ఆర్ ఫండ్ పై  శ్వేతపత్రం విడుదల చేయాలి
బీజేపీ ఐటీ సెల్  జాతీయ  కోకన్వీనర్ గోపి 

జహీరాబాద్, వెలుగు :  జహీరాబాద్​ నియోజకవర్గంలోని కర్మాగారాలు ఎంత మేరకు సీఎస్ఆర్ ఫండ్ చెల్లించాయో జిల్లా మంత్రి హరీశ్​రావు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కో కన్వీనర్ జంగం గోపి డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కర్మాగారాల ద్వారా వచ్చే సీఎస్ఆర్ ఫండ్ తో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  టీఆర్ఎస్ సర్కారు ఓట్ల కోసం పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులను మోసగిస్తోందని ఆరోపించారు. కులమతాల కతీతంగా జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు దినేశ్, అనిల్ రాథోడ్, అప్పం శ్రవణ్ కుమార్, 
తదితరులు పాల్గొన్నారు.

పోస్టాఫీసుల్లో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలి

మెదక్​ (పెద్దశంకరంపేట), వెలుగు :  పోస్టాఫీసుల్లో నగదురహిత యూపీఐ  ట్రాన్సాక్షన్లను  ప్రోత్సహించాలని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎస్వీఎల్ఎన్ రావు తపాల ఉద్యోగులకు సూచించారు. శనివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సబ్ పోస్టాఫీసును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ పోస్ట్ ఆఫీస్ పనితీరును రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్​ఐలో ఎక్కువ ట్రాన్సాక్షన్లను నిర్వహించిన సబ్ పోస్ట్ మాస్టర్ అనిల్​ను పోస్టల్ ఎస్పీ బహుమతి అందించి అభినందించారు. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని బ్రాంచ్, సబ్, హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో  యూపీఐ ద్వారా నగదు రహిత లావాదేవీలు చేసుకొనే అవకాశం ఉందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుకన్య సమృద్ధి యోజన పట్టణంగా పెద్దశంకరంపేటను తీర్చిదిద్దడానికి మండల టీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షుడు ఆసూరి మురళి పంతులు,  మండల పరిషత్ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.