- శ్రీహరి బ్లాక్‌మెయిల్ రాజకీయాల వల్లే తాటికొండ, అరూరి వెళ్లారని ఆగ్రహం
- బీఆర్‌ఎస్, కేసీఆర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు
- నిర్ణయం మార్చుకోకుంటే బుద్ధి చెబుతామని వార్నింగ్
వరంగల్, వెలుగు : బీఆర్‌ఎస్ వరంగల్ పార్లమెంట్ టికెట్‌ను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించడం పట్ల ఉద్యమకారులు మండిపడుతున్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసే కడియం ఫ్యామిలీకి సీటు ప్రకటించడం అంటే ఉద్యమకారులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పార్టీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ టికెట్ కావ్యకు కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన వెలువడిన వెంటనే ఉద్యమకారులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడంతో పాటు, బీఆర్‌ఎస్, కేసీఆర్‍ను తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు.
ఉద్యమకారులు ఇవ్వొద్దన్నా.. కావ్యకే ఇచ్చిన్రు
వరంగల్ పార్లమెంట్ టికెట్‌ను ఉద్యమకారులకే ఇవ్వాలని, లేదంటే సిట్టింగ్ ఎంపీకే మరో ఛాన్స్ ఇవ్వాలని ఉద్యమకారులు, కేయూ జేఏసీ నేతలు, బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు మొదటి నుంచీ కోరుతున్నారు. గతంలో పలు మార్లు మీటింగ్ పెట్టి మరీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో సభ్యత్వం లేని వారికి, ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనని కడియం కావ్యకు టికెట్ ఇవ్వొద్దని కోరారు. తమ మాట కాదని ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు కోసం కృషి చేయడం మానేసి ఆమె ఓడిపోయేందుకు పనిచేస్తామని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే విషయంపై కేసీఆర్, కేటీఆర్‌తో సహా జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందించారు. కానీ ఇవేవి పట్టించుకోని కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన వరంగల్ నియోజకవర్గ సమావేశంలో కావ్యకే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పేరును పలువురు ప్రతిపాదించినప్పటికీ ఆయన పోటీలో ఉండేందుకు విముఖత చూపారు. దీంతో కావ్యకు టికెట్ దక్కింది.
కడియం తీరుకు నిరసనగా ఉద్యమకారుల మీటింగ్
కడియం శ్రీహరి తీరుపై ఉద్యమకారులు మొదటి నుంచి సీరియస్‌గానే ఉన్నారు. ఆయన వ్యవహార శైలిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఉద్యమకారులతో పాటు కేయూ జేఏసీ నేతలు, బీఆర్‍ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే కేయూ, హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో మీటింగ్‌లు పెట్టారు. తాజాగా కావ్యకు టికెట్ ఓకే కావడంతో పార్టీ తీరుకు నిరసనగా గురువారం సైతం పలు చోట్ల మీటింగ్‌లు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు బోడ డిన్నా, జోరిక రమేశ్, చింతల యాదగిరి, కేయూ జేఏసీ నేతలు బొల్లికొండ వీరేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి రజినీకుమార్, పొలపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న తదితరులు సమావేశమై హైకమాండ్, కడియం శ్రీహరి తీరుపై విరుచుకుపడ్డారు.
శ్రీహరి తీరు కారణంగానే తాటికొండ రాజయ్య పార్టీకి దూరం కాగా, ఇప్పుడు అరూరి రమేశ్ సైతం అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. తన బిడ్డ కోసం సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ గొంతు కోశాడని మండిపడ్డారు. పోటీకి వచ్చే లీడర్లు, ఉద్యమకారులను తొక్కేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి తన బిడ్డకు టిక్కెట్ దక్కించుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ సైతం ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వకుండా కడియం వంటి నేతలకే ప్రయారిటీ ఇవ్వడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
కేసీఆర్ తీరుపై సోషల్ మీడియాలో ఫైర్
బీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్ సోషల్ మీడియా సైన్యంగా భావించే కొందరు లీడర్లే ఇప్పుడు ఆ పార్టీకి, లీడర్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్‌పై మాట పడకుండా చూసుకునే ఉద్యమకారులు ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ కావ్యకు కేటాయించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. వందలాది మంది బీఆర్‌ఎస్ అభిమానులే పార్టీ, కేసీఆర్ తీరుకు నిరసనగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరి, కావ్యకు సమాధానం చెప్పేందుకు ప్రజలు, ఉద్యమకారులు ఓటుతో సిద్ధంగా ఉన్నారంటూ వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.