సౌత్‌లో సక్సెస్ అయ్యే సినిమాలపై బాలీవుడ్ ఫోకస్ మరింత పెరిగింది. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు మలయాళ చిత్రం ‘అంగామలై డైరీస్’ కూడా ఆ జాబితాలో చేరింది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నప్పటికీ యాక్టర్, డైరెక్టర్ మాత్రం సౌత్ వాళ్లే. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తమిళంలో ‘కరుప్పుదురై’ అనే సింపుల్ కామెడీ సినిమాతో మెప్పించిన మధుమిత డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్‌తో ‘రామసేతు’ నిర్మిస్తున్న అబుడాంటియా ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
నిన్న ఈ సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒరిజినల్ మూవీ కథ మొత్తం కేరళలోని అంగామలై అనే ప్రాంతంలో జరుగుతుంది. దాన్ని హైదరాబాద్ కల్చర్‌కి తగ్గట్టుగా అడాప్ట్ చేసి ‘ఫలక్‌నుమాదాస్’గా తీసి హిట్ కొట్టాడు విశ్వక్‌సేన్. ఇప్పుడు హిందీ వెర్షన్ కోసం గోవా రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న దర్శకురాలు, ఓ రీమేక్‌లా కాకుండా ఇంటర్‌ప్రిటేషన్‌లా తీస్తున్నానని చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి ఓ తమిళ హీరో.. మలయాళ రీమేక్‌తో హిందీ సీమలోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా విశేషమే!