పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హిందీ సినిమాల్లో పవర్ఫుల్ పాత్రల్లో నటించిన అనుభవం ఉందామెకు. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'లో నటించినందుకు ఇటీవలే ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లింది. ఆమె జర్నీ గురించి తన మాటల్లోనే...

ముంబైలోని కలినా అనే ఏరియాలో ఉండే ఓ మధ్య తరగతి కుటుంబం మాది. మా నాన్న మిల్లులో పనిచేసేవాడు. చిన్నప్పట్నించీ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్నో నాటకాల్లో నటించాను కూడా. కాలేజీకి వెళ్లాక నా టాలెంట్​ని బయటపెట్టే ఛాన్స్​ వచ్చింది. యాక్టింగ్​లోనే కాదు.. స్పోర్ట్స్​లోనూ ముందుండేదాన్ని. స్టేట్​ లెవల్​లో కబడ్డీ ఆడా. ఆటల మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో ఇంటర్మీడియెట్ సెకండియర్​లో ఫెయిలయ్యా. ‘టెక్స్​టైల్ డిజైన్’​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాటకాలు వేసేదాన్ని.

నేను మొదటిసారి నటించిన సినిమా పేరు ‘బాయిమనస్’. కానీ అది థియేటర్లలో రిలీజ్ కాలేదు. మరాఠీలో ‘మి సింధుతై సప్కాల్’(2010) అనే సినిమాలో చేశా. ఆ తర్వాత బాలీవుడ్​లో అజయ్​ దేవగణ్​ నటించిన ‘సింగం రిటర్న్స్’ (2013) సినిమాలో నటించా. అది నా డెబ్యూ . అయితే డైరెక్టర్ నాగరాజ్​ మంజులే తీసిన ‘ఫండ్రీ’(2013)తో బ్రేక్​ వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘హైవే’, మరాఠీ సినిమా ‘సైరాట్’, ‘అంధాదున్’, ‘గంగుబాయి కథియావాడి’, ‘మడగావ్​ ఎక్స్​ప్రెస్’​, ‘లాపతా లేడీస్’ వంటి సినిమాల్లో నటించా. 

లాపతా లేడీస్​లో ఛాన్స్​ నా అదృష్టం

ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. సరైన టైంలో నాకు వచ్చిన అవకాశం అది. అందుకే వెంటనే ఒప్పుకున్నా. ఇందులో నటించిన మెయిన్​ లీడ్స్​ అంతా కొత్తవాళ్లు. కానీ, వర్క్​ పట్ల వాళ్ల డెడికేషన్​ చూసి నేను చాలా ఇన్​స్పైర్ అయ్యా. కొత్తవాళ్లతో పనిచేయడం నాక్కూడా చాలా ఇష్టం. ఈ సినిమాలో ఎంటర్​టైన్​మెంట్​తోపాటు మెసేజ్ కూడా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్​. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్​ చూశాక..  

ఇందులో నేను భాగం కావడం నా అదృష్టం అనిపించింది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఏడాది వరకు ఐదు నుంచి ఆరు సినిమాలు చేశా. కానీ ‘లాపతా లేడీస్’ వల్ల నాకు వచ్చిన గుర్తింపు చాలా ప్రత్యేకం. మొదటి సినిమా ఆ తర్వాత కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి పనిచేసిన అనుభవం అద్భుతం. అందులో నేను చేసిన ‘మంజు మాయి’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 

ఈ సినిమాలో ఛాన్స్​ రావడం కూడా వెరైటీగా జరిగింది. నాకు బాగా కావాల్సిన వ్యక్తి రోమిల్ మోడీ. అతను ఆ మంజు మాయి పాత్ర కోసం మనిషిని వెతికే పనిలో ఉన్నాడు. అక్కడ లోకల్​గా ఉండే వాళ్లు కావాలని చాలా వెతికాడట. అలా వెతుకుతూ నా దగ్గరకి వచ్చాడు. తన అప్రోచ్ చాలా డిఫరెంట్​గా ఉంది. నాలుగైదు లైన్ల డైలాగ్​ ఒకటి ఇచ్చి చెప్పమన్నాడు. ఆ డైలాగ్స్ ఉత్తరప్రదేశ్​ యాసలా ఉన్నాయి. మాదేమో మరాఠి. అప్పుడు నేను మనసులో... ‘ఇంత కష్టపడే బదులు యూపీ వాళ్లనే వెతుక్కుంటే బెటర్​ ఏమో’ అని అనుకున్నా. నిజానికి ఆ రోల్​ చేయడం ఉత్తరప్రదేశ్​ నుంచి వచ్చిన వాళ్లకయితే  చాలా ఈజీగా ఉండేది. కానీ వాళ్లలా అనుకోలేదు. రోమిల్​కి నాలో ఆ క్యారెక్టర్​ కనిపించింది. తను నన్ను ఆడిషన్ ఇవ్వమన్నాడు. అప్పుడు ‘మీకు ఎలా కావాలి?’ అని అడిగా. తను పంపిన ప్రకారమే నేను ట్రై చేసి పంపించా. 

కట్ చేస్తే.. ఆ తర్వాత నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్​ ‘కిరణ్ రావు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు’ అని. ఆమె ‘ఫండ్రీ’కి చాలా పెద్ద ఫ్యాన్’ అని తెలిసింది. ఆమెను కలిశాక ఇద్దరం ఆ సినిమా గురించి కాసేపు మాట్లాడుకున్నాం. రెండు సీన్లు చేసి చూపించా. ఫైనల్​గా ఆ పాత్రకు నన్ను ఓకే చేశారు. కిరణ్​ నాకు చాలా ఫ్రీడమ్​ ఇచ్చారు. ఆమె​ చాలా టాలెంటెడ్​. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోయే రోజే డీఓపీ(డైరెక్టర్​ ఆఫ్​ ఫొటోగ్రఫీ) అతనికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఆ రోజు రైల్వే స్టేషన్​లో షూటింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాం. అలా షూటింగ్​ స్టార్ట్ చేశాం. జూమ్​ కాల్​లో ఆ డీఓపీ మాకు సజెషన్స్​ ఇస్తుంటే... మేం మా పని పూర్తి చేశాం. ఆ విషయంలో కిరణ్​ని మెచ్చుకోవాల్సిందే.

ఆ పాత్రల్ని సవాల్​గా తీసుకుంటా

నాగరాజ్​ మంజులే ‘ఝుండ్’ సినిమాలో అమితాబ్​ బచ్చన్​ భార్యగా నటించా. ‘లాపతా లేడీస్​’లో నా వయసుకు మించిన పాత్రలో చేశా. అయితే, అలాంటి పాత్రల్ని ఎప్పుడూ సవాలుగానే తీసుకుంటా. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తాం. ఒక్కోదాంట్లో ఒక్కో ఏజ్ గ్రూప్​కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. ఆయా పాత్రలు, గెటప్​ కూడా డిఫరెంట్​గా ఉంటాయి. కిరణ్​రావు, పాయల్ లాంటి మహిళా  డైరెక్టర్లు ఇండస్ట్రీకి ఇంకా రావాలి. స్త్రీలయితేనే స్త్రీల సమస్యలను అర్థం చేసుకోగలరు. అంత బాగా మగ డైరెక్టర్లు అర్థం చేసుకోలేరు. పాయల్​ ఇండియన్​ సినిమాను కాన్స్​ ఫెస్టివల్​ వరకు తీసుకెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు ఆడవాళ్ల సత్తా ఎలా ఉంటుందో.

కాన్స్ విశేషాలు..

కాన్స్​ ఫెస్టివల్​కు నేను వెళ్లడం మొదటిసారి. కానీ మీడియాలో ఇంతకు ముందు కాన్స్​ ఫెస్టివల్​ చూసినప్పుడు అక్కడంతా గౌన్లు వేసుకున్న వాళ్లనే చూశా. దాంతో కాన్స్​కు నాకు పిలుపు రాగానే నా ఫ్రెండ్స్​ని ‘నేను కూడా గౌన్ వేసుకోవాలా?’ అని అడిగా. ‘నువ్వు ఒక స్టయిలిస్ట్​ని పెట్టుకుంటే బెటర్’ అని సలహా ఇచ్చారు.  నేను స్టయిల్​గా కనపడాలి. అలాగే వేసుకున్న డ్రెస్​ నాకు సౌకర్యంగా ఉండాలి. నా ఇండివిడ్యువాలిటీని రిప్రజెంట్​ చేసేలా ఉండాలి. అందుకని నేను ఒక స్టయిలిస్ట్​ని పెట్టుకున్నా. దాన్నొక రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యా. ఎందుకంటే అక్కడ నేను రిప్రజెంట్​ చేసేది ముంబయినో లేదా మహారాష్ట్రనో కాదు.. ఇండియాని. ఇన్నేండ్ల నా కెరీర్​లో నేనెప్పుడూ అలా రెడీ అవ్వలేదు. అదే మొదటిసారి నన్ను నేను అలాంటి లుక్​లో చూసుకోవడం. కానీ దాన్ని నేను చాలా ఎంజాయ్​ చేశా. 

సోషల్ మీడియా

ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్నింటికి ‘నో’ చెప్పలేం. ఫ్యాన్స్​తో మాట్లాడే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నా. ఇన్​స్టాగ్రామ్​ వాడుతున్నా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నా. ట్విట్టర్ అకౌంట్ ఉంది. కానీ అంతగా వాడట్లేదు. అది కూడా కాన్స్​కు వెళ్లే ముందే క్రియేట్​ చేసుకున్నా. 

ఇదంతా బాగానే ఉంది. కానీ అమ్మతో కలిసి విమానంలో జర్నీ చేయాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. అందుకే ఫ్రాన్స్ వెళ్లేటప్పుడు అమ్మ చీర కట్టుకుని, ముక్కెర పెట్టుకున్నా. అలా ఆమెను నాతో తీసుకెళ్లా. మా ఇంట్లో ఐదుగురు తోబుట్టువులం. నాన్న ఎప్పుడో చనిపోయారు. ఇద్దరు అన్నలు కూడా లేరు. ముంబయిలో నేను, అమ్మ ఉండేవాళ్లం. ఇప్పుడు నేనొక్కదాన్నే. కాకపోతే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. అందుకని మా ఇల్లు ఎప్పుడూ ఫ్రెండ్స్​తో కళకళలాడుతుంటుంది. 
 

ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్​

‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా డైరెక్టర్​, ఆమె టీం నా గురించి ముందుగానే బాగా రీసెర్చి చేసినట్టున్నారు. అందుకే నాకు ఎటువంటి ఆడిషన్​ తీసుకోకుండానే సినిమాలో అవకాశం ఇచ్చారు. పాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపాడియాతో కలిసి పనిచేయడం డిఫరెంట్​ ఎక్స్​పీరియెన్స్​. షూటింగ్​లో దాదాపు 25 టేక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు తీసుకునేది. ఒక్కో టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కో యాంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపించేది. ఇక ఇప్పటివరకు నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో అంత పెద్ద థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా చూడలేదు.

ఆ సినిమాను ప్రపంచ ప్రేక్షకులతో కలిసి చూడటం చాలా ఆనందంగా అనిపించింది. నేను మీకు ఇక్కడో విషయం చెప్పాలి... అంత దూరం నేను ఒంటరిగా ప్రయాణించడం అదే మొదటిసారి. ఫ్రాన్స్​ వరకు వెళ్తానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. ఇండియా నుంచి ఒక మహిళ దర్శకత్వం వహించిన సినిమా కాన్స్​ ఫెస్టివల్​లో స్క్రీన్​ అవడం 30 ఏండ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం!