హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రఖ్యాత నటుడు, తెలంగాణ బిడ్డ కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీశారని చెప్పారు. ఒకప్పుడు మద్రాస్ బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి తమకు ఇల్లు కేటాయించాలని కోరారు.
కాంతారావు శత జయంతి కార్యక్రమాన్ని ఆయన కొడుకులిద్దరు కలిసి ఇంటి వద్ద నిర్వహించిన ఓ ఫొటోను సీవీఎల్ నరసింహారావు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వ పడేలా అంగరంగ వైభవంగా ఇవాళ జరిగిన కాంతారావు గారి శతజయంతి కార్యక్రమంలో ఆయన కుమారులు’ అంటూ వ్యంగ్యంగా తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు. కాంతారావు కుటుంబాన్ని ఆదుకోవాలని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీవీఎల్ నరసింహారావు కోరారు.
కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కాంతారావు.. 400 వందలకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారని చెప్పారు. సినీ కళారంగానికి కాంతారావు చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్,ఏఎన్నార్ లు రెండు కండ్లయితే కాంతారావు ‘నుదుట తిలకం’గా ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.