మంచు వివాదం..జల్ పల్లిలో ఉద్రిక్తత.. మోహన్ బాబు ఇంటి ముందే మనోజ్ నిరసన

మంచు వివాదం..జల్ పల్లిలో ఉద్రిక్తత.. మోహన్ బాబు ఇంటి ముందే మనోజ్ నిరసన

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కొనసాగుతోంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇవాళ జల్ పల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.  ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చిందని చెబుతూ లోపలికి వెళ్లేందుకు యత్నించాడు.  పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు మనోజ్. తన తండ్రిని కలిసి మాట్లాడాలని మనోజ్ వాదించాడు.   దీంతో ఫామ్ హౌస్  ముందే కూర్చుని నిరసనకు దిగారు మనోజ్.

మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతోనే  ఫామ్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. బయట వ్యక్తులను ఎవరిని కూడా ఫామ్ హౌస్ లోకి అనుమతించడం లేదు పోలీసులు.

ఇప్పటికే  తన కారు ఇంట్లోని వస్తువులు ఎవరో తీసుకెళ్లారని మంచు మనోజ్ నార్సింగి  పోలీసులకు కంప్లైంట్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం గండిపేట మండలం నార్సింగిలోని ముప్పా విల్లాస్లోని 13వ నెంబర్ విల్లా ముందు ఏప్రిల్ ఒకటో తేదీన మంచు మనోజ్కు చెందిన కారును ఇంటి ముందు నిలిపారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో మనోజ్ డ్రైవర్ భోజనం చేస్తుండగా.. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అనుమానంతో బయటికి వచ్చిన మనోజ్ డ్రైవర్ కొలుసు సాంబశివరావు బిగ్గరగా కేకలు వేస్తూ కారుని ఆపడానికి యత్నించాడు.

కారుని ఆపకుండా అతివేగంతో ఆ దొంగలు ఉడాయించారు. దాంతో మనోజ్ డ్రైవర్ సాంబశివరావు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన కారు వెళ్లిన మార్గాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేశారు. రాజేంద్రనగర్ సమీపంలో దొంగలు వదిలి వెళ్ళిన మనోజ్ కారు పోలీసులకు లభ్యమైంది. కారును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కారును అపహరించింది దొంగలా లేక కుటుంబ కలహాల కారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులే ఎత్తుకెళ్లారా అనేది దర్యాప్తులో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.