టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని చెప్పాడు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ పెద్ద దర్గాను ఇవాళ సందర్శించాడు. దర్గాలోని మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దర్గా విశిష్టతను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాడు. చాలాకాలం నుంచి దర్గాకు రావాలని అనుకుంటున్నానని, అయితే సమయం లేక రాలేకపోయానని తెలిపాడు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం తనకు సంతోషంగా ఉందన్నాడు.
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని మంచు మనోజ్ చెప్పాడు. వచ్చే ఫిబ్రవరి నుంచి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్టు స్పష్టం చేశాడు. అలాగే త్వరలో కొత్త జీవితం ప్రారంభించి.. పెద్ద దర్గాకు కుటుంబ సభ్యులతో వస్తానని తెలిపాడు. ఇక మంచు మనోజ్ దర్గాకు వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు మంచు మనోజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.