ఒక్క పూట భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండేదట

ఒక్క పూట భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండేదట

భారతీయ సినీ ప్రేక్షకులకు డిస్కో డ్యాన్సర్ గా చేరువైన మిథున్ చక్రవర్తి...
నలభయ్యారేళ్ల యాక్టింగ్ కెరీర్ లో ఎన్నో సవాళ్లు...
మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ అందుకున్న మిథున్ చక్రవర్తి...
ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు రిలీజైన హీరోగా రికార్డ్...
ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆయన గురించి చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా వాటిలో కొన్నింటినైనా గుర్తు చేసుకోవాల్సిందే!

1950, జూన్ 16న కోల్‌కతాలో మిథున్ చక్రవర్తి జన్మించారు.  ఈయన అసలు పేరు గౌరంగ్ చక్రవర్తి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన... ఆ తర్వాత పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో డిగ్రీ సంపాదించారు. మార్షల్ ఆర్ట్స్ లో నూ ట్రైనింగ్ తీసుకున్న ఆయన..  బ్లాక్ బెల్ట్ సాధించారు. యంగ్ ఏజ్‌లో నక్సలిజం వైపు ఆకర్షితులైన మిథున్ దళంలో చేరారు. అయితే ఆయన బ్రదర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో నక్సలిజాన్ని వదిలేసి తల్లిదండ్రులకి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత సినిమాల వైపు అడుగేశారు. అయితే యాక్టర్ కాకముందు కొన్నాళ్లు స్టార్ డ్యాన్సర్ హెలెన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు మిథున్. అప్పట్లో ఒక్క పూట భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండేదట. దాంతో స్టేజ్‌ల మీద డ్యాన్స్ చేసేవారు. తన డ్యాన్స్ నచ్చి ఎవరో ఒకరు ఒక అవకాశం ఇవ్వకపోతారా అని ప్రతి పర్‌‌ఫార్మెన్స్ తర్వాత ఆశగా చూసేవారట. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. 

ఎన్నో అవార్డులు..

మృణాల్‌ సేన్ తీసిన ‘మృగయా’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మిథున్.... ఆ తర్వాత దో అంజానే, ఫూల్ ఖిలేహై గుల్షన్ గుల్షన్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 1978లో ‘మేరా రక్షక్’ మూవీతో హీరోగా మారారు. సురక్ష, తరానా, హమ్‌సే బడ్‌కర్‌‌ కౌన్, హమ్‌సే హై జమానా, వో జో హసీనా, ప్రేమ్‌ వివాహ్ వంటి చిత్రాలతో స్టార్‌‌గా మిథున్ ఎదిగారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే బాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ చేసిన మొదటి హీరో మిథునే. ఒక సంవత్సరంలోనే ఆయన నటించిన పంతొమ్మిది సినిమాలు రిలీజయ్యాయంటేనే ఆయనకి ఎంత డిమాండ్, క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుని మరో ఘనత సాధించారు మిథున్ చక్రవర్తి. ఆ తర్వాత తహాదర్‌‌ కథ, స్వామి వివేకానంద చిత్రాలకు కూడా నేషనల్ అవార్డ్ వరించింది. ఇంకా ఫిల్మ్ ఫేర్, స్క్రీన్, ఐఐఎఫ్‌ఏ, బీఎఫ్‌జేయే, ఆనంద్‌లోక్, స్టార్‌‌డస్ట్ అంటూ ఎన్ని అవార్డ్స్ అందుకున్నారో లెక్కే లేదు. ‘గురు’ సినిమాకిగాను బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా యాన్యువల్ సెంట్రల్ యూరోపియన్ అవార్డును కూడా తీసుకున్నారు. 

చైనా వాసులకూ మిథున్ తెలుసు..

 మిథున్ ఇప్పటి వరకూ మూడొందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు. హిందీతో మాత్రమే సరిపెట్టుకోకుండా....  బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, పంజాబీ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలతో పాటు తెలుగులోనూ యాక్ట్ చేశారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘మలుపు’లో మిథున్ విలన్‌ పాత్ర పోషించారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్‌ల ‘గోపాల గోపాల’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తన కెరీర్‌‌లో ఎన్ని సినిమాలు చేసినా.. మిథున్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాత్రం ‘డిస్కో డ్యాన్సర్’. 1982లో వచ్చిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అయామ్ ఎ డిస్కో డ్యాన్సర్’ అంటూ మిథున్ వేసిన స్టెప్స్ కి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. అప్పట్లోనే ఈ సినిమా వంద కోట్ల పైన వసూలు చేసిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ మూవీ చైనాలోనూ విడుదలై.... మంచి పేరు తెచ్చుకుంది. ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ అనే పాట ఇప్పటికీ అక్కడ మారుమోగుతూనే ఉండడం విశేషం.

రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలెన్నో..

‘డిస్కో డ్యాన్సర్’ మూవీ తర్వాత మిథున్‌కి వరుసగా ముప్ఫై ఫ్లాప్స్ వచ్చాయి. అయినా కూడా చేతినిండా సినిమాలుండడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. అదంతా తన అదృష్టమని మిథున్ అంటే.. అలా జరగడం అద్భుతమేనని క్రిటిక్స్ అంటుంటారు. రిలీజైన సినిమాల సంగతి అలా ఉంచితే.. రిలీజ్ ఆగిపోయిన సినిమాల విషయంలోనూ మిథున్‌దే రికార్డ్. రకరకాల కారణాలతో ఆయన నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. బోర్డర్, రెఫ్యూజీ, ఎల్‌ఓసీ కార్గిల్ , ఉమ్రావ్ జాన్ లాంటి ఎన్నో మంచి సినిమాలు తీసిన జేపీ దత్తా అప్పట్లో మిథున్‌తో ‘సర్‌‌హద్’ అనే సినిమా తీశారు. ఇది రిలీజ్ కాలేదు. అదే మిథున్‌కి మొట్టమొదటి అన్‌రిలీజ్డ్‌ ఫిల్మ్. ఆ తర్వాత సదా సుహాగన్, పరాక్రమి, జబ్ ప్యార్ హువా, మహా పాప్, వార్, బలిదాన్, కాల్‌దేవ్, మదర్‌‌ థెరెసా, నామర్ద్ లాంటి ఇరవై వరకు చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. దిలీప్‌ కుమార్‌‌, సునీల్‌ దత్‌లతో కలిసి 1992లో సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను స్థాపించారు మిథున్. ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయపడ్డారు. ఆ తర్వాత చాన్నాళ్లకు అనిల్‌ కపూర్‌‌తో కలిసి ఇదే పేరుతో ఓ వెబ్‌సైటును కూడా స్టార్ట్ చేశారు. 

పొలిటిషియన్ కం బిజినెస్ మెన్ ఆల్సో.. 

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా మిథున్ యాక్టివ్‌గా ఉంటారు. మమతా బెనర్జీ పాలనతో రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2016లో రాజీనామా చేసిన మిథున్... ఐదేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. ఇక చాలా కంపెనీలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కూడా. ప్యానసోనిక్, గో డాడీ, మణప్పురం గోల్డ్ లాంటి చాలా సంస్థల తరఫున పని చేశారు. ఒక టైమ్‌లో రాయల్ బెంగాల్ టైగర్స్‌ క్రికెట్ టీమ్‌కి కూడా మిథున్ కో ఓనర్‌‌గా ఉన్నారు. దేశంలో  ఫుట్‌బాల్ ప్లేయర్స్ ని ప్రోత్సహించే లక్ష్యంతో తలపెట్టిన బెంగాల్ ఫుల్‌బాల్‌ అకాడెమీకి కూడా మిథున్ కో ఓనర్ గా చేశారు. మిథున్ ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్ కూడా. ఊటీ, తమిళనాడు, డార్జిలింగ్, సిలిగురి, కోల్‌కతాల్లో హోటల్స్ నడుపుతున్నారాయన.

మిథున్'పై వచ్చిన పుస్తకాలు

 మిథున్‌కి కుక్కలంటే ప్రాణం. ముంబైలోని ఆయన బంగ్లాలో ఎప్పుడూ ముప్ఫై, ముప్ఫై అయిదు డాగ్స్ ఉంటాయి. ఊటీ ఇంట్లో అయితే అంతకు రెట్టింపు ఉంటాయట. కుక్కల సంరక్షణ కోసం పనిచేసే కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా జాయినయ్యారాయన. మిథున్‌పై చాలా పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన వెస్ట్ బెంగాల్‌కి చెందినవారు కావడంతో చాలామంది బెంగాలీ రైటర్స్‌ మిథున్‌ గురించి బుక్స్ రాశారు. అమర్ నాయికార, అనన్య మిథున్, మిథునర్ కథ, సినిమే నామ్‌తే హోలో వంటి బెంగాలీ పుస్తకాలతో పాటు లీవ్ డిస్కో డ్యాన్సర్ అలోన్, ట్రిబ్యూట్ టు మిథున్ చక్రవర్తి లాంటి ఇంగ్లిష్ బుక్స్ కూడా వెలువడ్డాయి. పలు సందర్భాల్లో తన ఫ్యాన్స్ కి మిథున్ ఇచ్చిన జవాబులన్నింటితో కూడా ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు.  

అరుదైన ఘనతలు..

‘గోల్‌మాల్ 3’ చిత్రం కూడా డ్యాన్సింగ్ స్టార్ గా మిథున్‌ కెరీర్‌‌కి ప్యారడీనే. ‘డిస్కోడ్యాన్సర్‌‌’ టైటిల్‌ సాంగ్‌తో పాటు ఆ సినిమాలోని యాద్ ఆ రహా హై పాట కూడా ఈ చిత్రంలో ఉంది. ‘ఢెల్లీ బెల్లీ’ మూవీలో ఆమిర్‌‌ ఖాన్ కూడా ఓ పాటలో మిథున్‌ని అనుకరించాడు. ఇక జిమ్మీ జింగ్‌చక్‌ అనే కామిక్‌ బుక్‌లో మిథున్‌ని పోలిన ఓ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. గినియా–బిస్సావు దేశం మిథున్‌ గౌరవార్థం 2010లో పోస్ట్ స్టాంప్ విడుదల చేసింది.  

బుల్లితెరపైనా...

సెకెండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపైన హోస్ట్ గా తన ముద్ర వేస్తున్నారు మిథున్. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, దాదాగిరి అన్‌లిమిలెడ్, ద డ్రామా కంపెనీ, డ్యాన్స్ ప్లస్ లాంటి చాలా షోస్‌కి ఆయన హోస్ట్ గా, జడ్జ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘హునర్‌‌బాజ్: దేశ్‌కీ షాన్’ ప్రోగ్రామ్‌కి పరిణీతి చోప్రాతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 

మిథున్ వివాహజీవితం

1979లో హెలెనా లూక్‌ అనే నటిని మిథున్ పెళ్లాడారు. కానీ నాలుగు నెలలకే ఆమెతో విడిపోయి.. ఆ తర్వాత నటి యోగితా బాలిని వివాహం చేసుకున్నారు. అయితే యోగితకి కూడా అది రెండో పెళ్లే. ఆమె మొదట లెజెండరీ సింగర్ కిశోర్‌‌ కుమార్‌‌ని పెళ్లి చేసుకున్నారు. కానీ రెండేళ్లకే ఆయన నుంచి విడిపోయారు. దానికి కారణం కూడా మిథునే అంటారు. కిశోర్‌‌తో ఉండగానే మిథున్‌తో ప్రేమలో పడ్డారట యోగిత. ఆ విషయం తెలిసి మిథున్ సినిమాలకి పాటలు పాడటం ఆపేశారట కిశోర్. ఆ కోపం చివరికి విడాకులు తీసుకోడానికి దారి తీసిందని చెబుతారు. తర్వాత మిథున్‌కి భార్య అయ్యారు యోగిత. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. నటి మదాలస శర్మ వీరి కోడలు. 

ఇప్పటికీ మిస్టరీనే..

మిథున్‌ ఓ సమయంలో శ్రీదేవిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్‌వర్గాల సమాచారం. ఆ విషయం తెలిసి యోగిత సూసైడ్ అటెంప్ట్ చేయడంతో భయపడి మిథున్.. శ్రీదేవికి దూరమైపోయారట. అయితే ఆయనసలు శ్రీదేవిని పెళ్లి చేసుకోలేదని, చేసుకోవాలనుకునే సమయంలోనే ఇదంతా జరిగిందని మరికొందరు అంటుంటారు. యోగిత మాత్రం తన భర్త అలాంటివాడు కాదని, తనను బాధపెట్టే పని ఎప్పుడూ చేయడని, నిజంగా అతను ఇంకెవరినైనా కోరుకుంటే ఒప్పుకుని పక్కకి వెళ్లిపోతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మిథున్, శ్రీదేవిల ప్రేమకథ ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.