మీడియాపై మోహన్ బాబు దాడి.. కెమెరాలు, మైకులు ధ్వంసం

హైదరాబాద్ శివారు షాద్ నగర్‏‎లోని జల్‎పల్లిలో ఉన్న ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతోన్న పరిణామాలను కవరేజ్‎కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబుతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. మీడియా ప్రతినిధుల చేతిలోని మైకులు, కెమెరాలను లాక్కుని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్ట్‎లకు గాయాలు అయినట్లు సమాచారం. ఈ పరిణమాలతో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 

కాగా,  మంగవారం (డిసెంబర్ 10) రాత్రి  మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్‎, అతడి భార్య మౌనికను ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కారును ఇంటి బయట గేట్ దగ్గరే  సిబ్బంది ఆపేశారు. కారు దిగిన మనోజ్ దంపతులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది రాకుండా అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు గేట్ వద్ద నిల్చున్న మనోజ్ తనను అడ్డుకున్న సెక్యూరిటీ  సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు లోపలే ఉందని..  తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని మనోజ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. 

Also Read :- మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్

అయినప్పటికీ సిబ్బంది ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించకపోవడతో చేసేదేమి లేక బలవంతంగా గేట్లు తోసుకుని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన జరల్నిస్టులపై మోహన్ బాబు దాడికి దిగారు. తీవ్ర కోపాద్రిక్తుడైన ఆయన జర్నలిస్టుల మైకులు, కెమెరాలు లాక్కున్నాడు. ఈ నాటకీయ పరిణామాలతో జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఇంటి బయట మనోజ్, మోహన్ బాబు వర్గాలకు చెందిన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. 

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల బౌన్సర్లను ఇంటి నుండి బయటకు పంపి మోహన్ బాబు నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.  కాగా, గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.