తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో

తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు సినీ నటుడు నాగార్జున. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం పర్యాటకులను ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయన్నారు. వరంగల్ లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం ప్రతీ ఒక్కరు చూడాల్సిన వారసత్వ సంపదన్నారు. యాదగిరి గుట్ట ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో వర్ణించలేమన్నారు. 

తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్  చికెన్, సర్వపిండి, ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్, హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. వాటిని తలచుకుంటేనే నోరూరుతుందన్నారు. తాను చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగానంటూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి టూరిస్టులను ఆహ్వానించారు నాగార్జున.