Ponnambalam: నా కోసం రూ.60 లక్షలకు పైనే ఖర్చు చేశారు..చిరంజీవిపై పొన్నాంబళం ఎమోషనల్

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన 69వ పుట్టినరోజు సందర్భంగా తమిళ నటుడు పొన్నాంబళం (Ponnambalam) చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చారు. చిరంజీవి  పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పొన్నాంబళం చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని, తన హుదారత గుణాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. 

పొన్నాంబళం మాట్లాడుతూ..‘‘నేను ఇప్పటి వరకు పలు భాషల్లో కలిపి దాదాపు 1500 సినిమాల్లో నటించాను. చిరంజీవితో కలిసి చేసిన ఘరానా మొగుడు హిట్ కాకపోతే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను అని అప్పుడు చెప్పాను. అది చాలా పెద్ద హిట్ అయింది. అలాగే, ఆ రోజుల్లో (1985- 86) ఫైట‌ర్స్ కి రోజుకు 350 రూపాయ‌లు ఇచ్చేవారు. కానీ చిరంజీవి మాత్రం షూటింగ్ కి వెళ్తే ఫైటర్స్‌కి 1000 రూపాయ‌లు ఇచ్చేవారు. అంత డ‌బ్బు నేను ఏ న‌టుడి సినిమాకి ఎప్పుడూ అందుకోలేదు. తొలిసారి చిరంజీవి గారు సినిమా కార‌ణంగానే వ‌చ్చేది.

కొన్నేళ్ల క్రితం కిడ్నీ సమస్య కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ‌పడుతోన్న స‌మ‌యంలో చిరంజీవి ఆర్దిక స‌హాయం చేసారు. దాదాపు 60 ల‌క్ష‌లకు పైగా వైద్యానికి ఖ‌ర్చు చేసారని గుర్తు చేసుకున్నారు". ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి గారి చలవే. ఈ జీవితం ఆయన ఇచ్చిందే’’..ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాలి' అని పొన్నాంబళం వేదికపై తన కృతజ్ఞతను తెలిపారు. 

ఘరానా మొగుడు, హిట్లర్, ముగ్గురు మొన‌గాళ్లు, సహా పలు సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్నారు తమిళ నటుడు పొన్నాంబళం. విలన్ పాత్రల్లో నటించిన పొన్నాంబళం మెగాస్టార్ చిరుతో కలిసి చాలా సినిమాల్లో కనిపించాడు. వీరిద్దరు కలిసి చేసిన సినిమాల సమయంలోనే మంచి సాన్నిహిత్యం కూడా పెరిగింది.