
అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.
పోసాని అరెస్ట్, రిమాండ్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోసాని కేసు ఆర్గనైజ్డ్ క్రైం కాదన్న పొన్నవోలు ఆయనకు రిమాండ్ విధించవద్దని వాదనలు వినిపించారు. 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.
ఏంటి ఈ కేసు..?
ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఓబులవారిపల్లి మండలానికి జనసేన నాయకుడు జోగినేని మణి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, ఆయనపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న పోసానిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.