నటుడు ​రఘుబాబు కారు ఢీకొని... బీఆర్ఎస్ ​లీడర్​ మృతి

  •     నల్గొండ పట్టణంలో ప్రమాదం
  •     మృతుడు బీఆర్ఎస్​పట్టణ కార్యదర్శి 
  •     ప్రమాదం తర్వాత పోలీసులకు లొంగిపోయిన రఘుబాబు 
  •     వివరాలు తీసుకుని పంపించిన పోలీసులు 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలో సినీ నటుడు రఘుబాబు నడుపుతున్న కారు ఢీకొని ఓ బీఆర్ఎస్ నేత చనిపోయాడు. నల్గొండ టూ టౌన్ సీఐ డానియల్ కుమార్, ఎస్ఐ రావుల నాగరాజు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ వేశాడు. ప్రతిరోజు మధ్యాహ్నం వెంచర్ వద్దకు వెళ్లి వస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం కూడా వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్​నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కేఏ 03 ఎంపీ 69 14 బీఎండబ్ల్యూ కారు రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద జనార్దన్ రావు వెళుతున్న బైక్​ను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో జనార్దన్ రావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాద సమయంలో కారును ప్రముఖ నటుడు గిరిబాబు కొడుకు రఘుబాబు నడిపారు. యాక్సిడెంట్ తర్వాత రఘుబాబు పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. ఆయన దగ్గర వివరాలు తీసుకున్న పోలీసులు పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించినట్టు సమాచారం. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి. జనార్దన్ రావుకు భార్య నాగమణి, బిడ్డ, కొడుకు ఉన్నారు. గత మున్సిపల్​ఎన్నికల్లో నల్గొండ మున్సిపాలిటీ 19 వ వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జనార్దన్​స్వల్ప తేడాతో ఓడిపోయారు. జనార్దన్​నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.