దయాతో మళ్లీ వచ్చింది
రమ్య నంబీశన్... లేటెస్ట్గా జె.డి. చక్రవర్తి నటించిన ‘దయా’ వెబ్ సిరీస్‌లో ‘జర్నలిస్ట్ కవిత’గా పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఆమె నటి మాత్రమే కాదు... సింగర్, డాన్సర్ కూడా. మలయాళం, తమిళం, తెలుగులో ఎన్నో పాటలు పాడింది. ‘పుష్ప’ సినిమాలో ఫేమస్ అయిన ‘ఊ అంటావా మావా..’ సాంగ్‌ని మలయాళ వెర్షన్లో పాడింది రమ్య. ‘మల్టీ టాస్కింగ్ అంటే ఇష్టం’ అంటున్న ఆమె ఆ మల్టీ టాలెంట్‌తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఆమె గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి.
మాది కేరళ. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం ఉన్ని. ఆయన ఒకప్పుడు థియేటర్ ఆర్టిస్ట్. అమ్మ పేరు జయశ్రీ. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. పేరు రాహుల్ నంబీశన్. తను మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. చిన్నప్పుడు మా ఊళ్లో ఉన్న మహాత్మా గాంధీ పబ్లిక్ స్కూల్లో చదివా. ఆ తర్వాత ఎర్నాకులంలోని సెయింట్ థెరెసా కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. చదువుకునే రోజుల్లో యాక్టింగ్ అంటే నాకు అంతగా తెలియదు. కానీ, సింగింగ్ అంటే మాత్రం నాకు మొదట్నించీ చాలా ఇష్టం. మల్టీ టాస్కింగ్ చేయడమంటే ఇష్టం. అందుకనే చిన్నప్పుడే క్లాసికల్ మ్యూజిక్‌తోపాటు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నా.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలు
మలయాళంలో ‘సయాహ్నం (2000) అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా. ఆ ఛాన్స్ మా డాన్స్ టీచర్ వల్ల వచ్చింది. నేను డాన్స్ నేర్చుకుంటున్న టైంలో మా డాన్స్ టీచర్‘‘ నాకు తెలిసిన వాళ్లు ఒక సినిమా తీస్తున్నారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతూ నన్ను అడిగారు. ఆ క్యారెక్టర్‌కి మీ పాప అయితే బాగుంటుంది’’ అని మా అమ్మానాన్నలతో చెప్పింది. వాళ్లు ఒప్పుకోవడంతో నాకు నటించే ఛాన్స్ దక్కింది. కానీ... షూటింగ్ అప్పుడు మొదటిసారి కెమెరా ముందు నిల్చొని డైలాగ్స్ చెప్పాలంటే చాలా టెన్షన్ పడ్డా. కానీ ఫస్ట్ షాట్, ఫస్ట్ టేక్‌లోనే ‘ఓకే’ అయిపోయింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆరు సినిమాలు చేశా. ఆ తర్వాత యాక్టింగ్ మీద కాకుండా సింగింగ్ మీద దృష్టి పెట్టా. దాంతో చాలాకాలం యాక్టింగ్‌కి బ్రేక్ పడింది.
సింగర్ కమ్ యాంకర్
నేను ప్లే బ్యాక్ సింగర్‌గా పాటలు పాడిన సినిమాలతో పోలిస్తే యాక్ట్ చేసిన సినిమాలు తక్కువ. ప్లే బ్యాక్ సింగర్‌గా నా మొదటి పాట ‘మేఘరూపన్’ అనే సినిమాలో ‘అండి లొండె..’. దానికి బెస్ట్ ఫిమేల్ మలయాళం ప్లే బ్యాక్ సింగర్‌గా అవార్డ్ అందుకున్నా. ఆ తర్వాత ‘తట్టతిన్ మరయతు’ సినిమాలో టైటిల్ సాంగ్‌కి పాపులారిటీ వచ్చింది. ఆ ఏడాది బాగా డిమాండ్ ఉన్న సాంగ్ అదే. ఒకవైపు సింగర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే యాంకరింగ్‌లోకి అడుగుపెట్టా. నిజానికి న్యూస్ రీడర్ ఇంటర్వ్యూకోసం వెళ్లా. కానీ సెలక్ట్ కాలేదు. దాంతో నా పేరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. ఆ తర్వాత నన్ను ‘హలో గుడ్ ఈవెనింగ్’ లైవ్ షోకి యాంకరింగ్ చేయమని పిలిచారు. యాంకరింగ్ చేయడం ఎలాగో తెలియదు.
లైవ్ షో అనగానే టెన్షన్ పడ్డా. ఆ తర్వాత ఎలాగో మేనేజ్ చేశా. యాంకరింగ్ చేస్తున్న టైంలోనే మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు రావడం మొదలైంది. మొదట్లో నేను యాక్టింగ్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయారు. మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. సపోర్టింగ్ రోల్స్‌తో మొదలై ఆ తర్వాత 2005లో ‘ఒరు నాళ్ ఒరు కనవు’ అనే తమిళ సినిమాలో లీడ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది. మరుసటి ఏడాది మలయాళంలో ‘ఆనచందం’ అనే మూవీలో లీడ్ రోల్ చేశా. 2016లో కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీ చేశా.
టాలీవుడ్‌తో అనుబంధం
తెలుగులో 2008లో ‘నువ్విలా’ సినిమాతో అడుగుపెట్టా. తెలుగులో నా ఆఖరి సినిమా ‘సారాయి వీర్రాజు’. తెలుగు సినిమాల్లో నటించా కానీ తెలుగులో పాడటం మాత్రం చాలా కష్టం. తెలుగు భాష అంత సులువు కాదు. అందుకే లిరిక్స్‌కి తగిన ఫీల్ వచ్చేలా పాడటానికి చాలా కష్టపడ్డా. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ.. అంటావా మావా...’ పాటని మలయాళ వెర్షన్లో పాడింది నేనే. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో ‘తిరి.. తిరి..’ పాట మలయాళంలో నేనే పాడా. మలయాళ సినిమా ‘తట్టతిన్ మరయతు’లో ‘ముతుచిప్పి పొలొరు’ అనే పాట పాడా. ఆ సినిమాని తెలుగులో ‘సాహెబా సుబ్రమణ్యం’గా రీమేక్ చేశారు. అందులో ‘ముద్దు ముద్దు...’ పాటలో మీరు విన్నది నా గొంతే.
ఎప్పుడూ స్టూడెంట్‌లా..
యాక్టర్స్ అనేవాళ్లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. స్కిల్స్ పెంచుకోవాలి. శాటిస్ఫ్యాక్షన్ అంటూ ఉండదు. నావరకయితే ఆ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేస్తా. సింగింగ్ కూడా అంతే. నేను ఒక మంచి పాట పాడితే మ్యూజిక్ డైరెక్టర్ మెచ్చుకుంటాడేమో. కానీ, నన్ను నేను మాత్రం ఎప్పుడూ విమర్శించుకుంటా. నేను సెల్ఫ్ – క్రిటిక్ పర్సన్‌ని. నేనెప్పుడూ నా స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తా. ఎప్పుడూ స్టూడెంట్‌లా ఉండి నేర్చుకుంటూ ఉండడం అనేది కూడా మంచి విషయం. నేను వచ్చింది మలయాళం ఇండస్ట్రీ నుంచి అయినా నాకు తమిళ ఇండస్ట్రీలో పనిచేయడం కష్టంగా అనిపించలేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి తగ్గట్టు చేసేందుకు ట్రై చేస్తా.”
‘దయా’ ముచ్చట్లు
- ఇంతకుముందు ఒక సినిమాలో జర్నలిస్ట్‌గా గెస్ట్ రోల్ చేశా. కానీ, ‘దయా’లో జర్నలిస్ట్ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు కవిత. చాలా తెలివైన, ధైర్యం ఉన్న జర్నలిస్ట్ పాత్ర. చాలామంది సినిమాల్లో జర్నలిస్ట్ రోల్ అనగానే... ప్రొఫెషనల్ సైడ్ మాత్రమే చూపిస్తారు. కానీ, ఈ సిరీస్‌లో పర్సనల్ లైఫ్ గురించి కూడా ఉంటుంది. ఫ్యామిలీని, పబ్లిక్ లైఫ్‌ని జర్నలిస్ట్ కవిత ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూపించారు.
- నేను నార్మల్‌గానే ఏ క్యారెక్టర్ కోసం హోం వర్క్ చేయను. నేచురల్‌గానే పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తా. ‘దయా’లో జర్నలిస్ట్ పాత్ర కోసం కూడా నేను డైలీ లైఫ్‌లో కనిపించే అంశాలను బాగా గమనించా. క్యారెక్టర్ కోసమనే కాదు.. మామూలుగానే మేనరిజమ్స్ గమనించడం నాకు అలవాటు.
- పవర్ఫుల్ రోల్‌తో మళ్లీ తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో పదేండ్ల కిందట తెలుగు సినిమాల్లో నటించా. కాబట్టి తెలుగులో మాట్లాడటం నాకు ఛాలెంజ్. డైలాగ్స్‌కి లిప్‌సింక్ ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది. ఈ సిరీస్ నా కెరీర్‌కి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా.
- ‘బి 32 మతువల్ 44 వరె’ సినిమా డైరెక్టర్ శ్రుతి శరణ్యం. డైరెక్టర్‌గా ఆమెకు ఇది మొదటి సినిమా. అందులో నాది లీడ్ రోల్. ఆరుగురు మహిళల కథ. ఈ ప్రాజెక్ట్‌లో టెక్నీషియన్స్ కూడా చాలామంది ఆడవాళ్లే. దాదాపు టీంలో 30 మందిమి ఆడవాళ్లం ఉండి ఉంటాం. ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది.
- నటిని కాకపోయి ఉంటే టీచర్ అయ్యేదాన్ని. చిన్నప్పటినుంచీ బయాలజీ టీచర్ అవ్వాలనుకునేదాన్ని. అందుకే ప్లస్ టూలో సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నా. కానీ ఎలాగో యాక్టింగ్ వైపు వచ్చేశా. ఇప్పుడు నా దృష్టంతా నటనమీదే. ఇది నా ప్రొఫెషన్ అని గర్వంగా చెప్తా. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు సినిమాలు డైరెక్ట్ చేయాలనేది నా కల.
- బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగా తింటా. ఎక్కువగా ఇంట్లో చేసిన వంట తినడమే నాకు ఇష్టం. నాకు వంట వచ్చు. కాబట్టి ఖాళీ టైం దొరికితే వంటగది నా ప్రయోగశాల అయిపోతుంది.