సాయికుమార్​కు కుమ్రంభీం జాతీయ అవార్డు

సాయికుమార్​కు కుమ్రంభీం జాతీయ అవార్డు

ఆసిఫాబాద్, వెలుగు: సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్​కు కుమ్రంభీం జాతీయ పురస్కారం వరించింది. దర్శక నిర్మాత నాగబాల సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్​లోని ప్రేమల గార్డెన్​లో ఈ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం జరిగింది. భారత్ కల్చరల్ అకాడమీ, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, ఓం సాయి తేజ ఆర్ట్స్, నవ జ్యోతి సంస్థలు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించాయి. 2024 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు సాయికుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాయికుమార్​కు భారత్ కల్చర్ అకాడమీ కమిటీ చైర్మన్ పార్థసారధి, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అవార్డు, రూ.50వేల నగదు అందజేసి సన్మానించారు. అంతకుముందు కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడారు. 

‘‘కుమ్రంభీం పోరాటం స్ఫూర్తిదాయకం. ఆదివాసి హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల ఆరాధ్య దైవం. జల్.. జంగల్.. జమీన్ కోసం నిజాంతో విరోచితంగా పోరాడి అసువులు బాసిన మన్నెం వీరుడు.. కుమ్రం భీం’’అని పార్థసారధి అన్నారు. ఆదివాసీలంతా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుని ముందుతరాలకు అందించాలని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి 12 ఏండ్లుగా కుమ్రంభీం జాతీయ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. 2024 కిగాను నటుడు సాయికుమార్​ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. 

కుమ్రంభీం జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సాయికుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపారు. కుమ్రంభీం పేరిట జాతీయ అవార్డులు అందించడం గిరిజన జాతికి గర్వకారణమని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. నిజాం నవాబులను గడగడలాడించిన మహనీయుడు కుమ్రంభీం అని గుర్తు చేశారు. కుమ్రంభీం పేరిట జాతీయ పురస్కారాలు ఇవ్వడం జిల్లాకే తలమానికం అని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, మాజీ మంత్రి బాబు మోహన్, హాస్యనటుడు శివారెడ్డి, కుమ్రంభీం మనుమడు సోనేరావు పాల్గొన్నారు.