ఆరడుగుల పొడవు, అందమైన రూపం, నటనలో హుందాతనం.. జమీందార్ లాంటి రిచ్ క్యారెక్టర్ అయినా, మిడిల్ క్లాస్ పాత్రయినా మెప్పించగల నటుడు శరత్ బాబు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భౌతికంగా దూరమైనా.. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి.
1951, జులై 31న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో పుట్టారు శరత్ బాబు. విజయశంకర దీక్షితులు సుశీలాదేవి ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు అన్నదమ్ముల్లో మూడో సంతానం శరత్ బాబు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత శరత్ బాబుగా పేరు మార్చుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారట. అయితే కంటి సమస్య ఉండటం వల్ల ఆ కోరిక నెరవేరలేదట. అప్పటికే తమకు ఊర్లో ఉన్న హోటల్ వ్యాపారాన్ని చూసుకోమని తండ్రి చెప్పినప్పటికీ స్నేహితుల బలవంతంతో శరత్‌బాబు సినిమాల వైపు అడుగులేశారు.
‘రామరాజ్యం’తో హీరోగా..
తన అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు ఫొటోలు పంపగా.. ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. మద్రాసుకు వెళ్లి కలిస్తే మళ్లీ కబురు చేస్తాం అన్నారు. ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని మద్రాస్‌లోనే ఉన్న శరత్ బాబును.. రామా విజేత ప్రొడక్షన్స్ సంస్థ కొత్త హీరో కావాలని ఇచ్చిన ప్రకటన ఆకర్షించింది. ఆడిషన్‌కు మూడు వేల మంది హాజరయితే.. అందులో దర్శకుడు బాబూరావు శరత్ బాబుని హీరోగా సెలక్ట్ చేశారు. ఆ సినిమానే 1973లో వచ్చిన ‘రామరాజ్యం’.
విలక్షణ పాత్రలెన్నో..
తొలిచిత్రంలోనే ఎస్వీ రంగారావు, జగ్గయ్య, సావిత్రి లాంటి సీనియర్స్‌తో కలిసి నటించారు. ఆ తర్వాతి సంవత్సరం వచ్చిన ‘నోము’లో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేశారు. అది సక్సెస్ సాధించడంతో నటుడిగా మంచి గుర్తింపుతో పాటు నెగెటివ్ రోల్స్ కూడా వచ్చాయి. మరోవైపు బాలచందర్ సినిమా ‘నిళల్ నిజమాగిరదు’ చిత్రం సక్సెస్‌తో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇది కథకాదు, గుప్పెడు మనసు చిత్రాలతో మెప్పించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, రజినీకాంత్, కమల్‌హాసన్ సహా పలువురు స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలు కూడా చేశారు. అవి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.
అంతరంగాలు..
శరత్ బాబు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తనకంటే సీనియర్ అయిన రమాప్రభతో శరత్ బాబుకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దాంతో తనకంటే నాలుగేళ్లు పెద్దదైన రమాప్రభను ఆయన పెళ్లి చేసుకున్నారు. పద్నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్న ఆ జంట.. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో 1988లో విడాకులు తీసుకున్నారు. 1990లో తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహా నంబియార్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. 2011లో ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు.
మూడు నంది అవార్డులు
సీతాకోక చిలుక, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, ముత్తు, అన్నయ్య లాంటి ఎన్నో చిత్రాలు నటుడిగా ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’లో ఆయన పోషించిన పాత్రకు మంచి స్పందన లభించింది. అలాగే ఆయన నటించిన చివరి చిత్రం ‘మళ్లీ పెళ్లి’ ఈ నెల 26న విడుదలవుతోంది. ఆయన ఇందులో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా మూడు నంది అవార్డులను అందుకున్నారు శరత్ బాబు. ‘అంతరంగాలు’ లాంటి పలు టీవీ సీరియల్స్‌తోనూ శరత్ బాబు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.