Sayaji Shinde: సినీ నటుడు సాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరారో చూడండి..!

Sayaji Shinde: సినీ నటుడు సాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరారో చూడండి..!

ముంబై: సినీ నటుడు సాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అజిత్ పవార్ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్న ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజిత్ పవార్ ఆయనకు ఎన్సీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన సాయాజీ షిండే తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, భోజ్పురి సినిమాల్లో నటించారు. ఎన్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలిటీషియన్ పాత్రల్లో చాలా సినిమాల్లో నటించానని, కానీ ఇప్పటిదాకా పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదని చెప్పారు.

రాజకీయాలకు దూరంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కంటే రాజకీయాల్లోకి వచ్చి సోషల్ సర్వీస్ చేయడం మేలనే అభిప్రాయానికి వచ్చానని తెలిపారు. అందుకే రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ఎన్సీపీ అజిత్ పవార్ పాలసీలు తనను ఆకర్షించాయని, అందుకే ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం వెనుక ఎలాంటి స్వార్థం లేదని సాయాజీ షిండే చెప్పారు. సాయాజీ షిండే ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసిన సంగతి తెలిసిందే. సాయాజీ షిండే కీలక పాత్రలో నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం విదితమే.