ఆప్‎లో చేరిన స్టార్ యాక్టర్ సోనియా మాన్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేజ్రీవాల్

ఆప్‎లో చేరిన స్టార్ యాక్టర్ సోనియా మాన్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేజ్రీవాల్

ఛండీఘర్: పంజాబ్ నటి, కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కుమార్తె సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో సోనియా ఆప్‎లో జాయిన్ అయ్యారు. కేజ్రీవాల్ ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీలో సోనియా జాయిన్ కావడం చర్చనీయాంశంగా మారింది. 

ఆప్‎లోకి సోనియా రాకను ఆప్ పంజాబ్ యూనిట్ స్వాగతించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) ఎక్స్ వేదికగా ఆప్ పోస్టు పెట్టింది. ‘‘కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు ఎస్ బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబంలోకి స్వాగతం’’ అంటూ ట్వీట్ చేసింది. 

ఎవరీ సోనియా మాన్..?

1980లలో ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన రైతు కిసాన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కూతురే సోనియా మాన్. పంజాబీతో పాటు ఇతర భాషాల్లో యాక్ట్ చేసి సోనియా మాన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీతో సహా వివిధ భాషలలో బహుళ చిత్రాలలో నటించింది. సోనియా మాన్ తొలి చిత్రం 'హైడ్ ఎన్' సీక్'. 2014లో హిందీలో తొలిసారిగా కహిన్ హై మేరా ప్యార్‌లో కూడా యాక్ట్ చేసింది. 2020లో వచ్చిన హ్యాపీ హార్డీ, హీర్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది సోనియా మాన్.

ALSO READ | బీజేపీకి ధీటుగా ఆప్ స్కెచ్.. ఢిల్లీ ప్రతిపక్ష నాయకురాలిగా అతిశీ

సినిమాలతో పాటు 2018లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సహా ప్రసిద్ధ సింగర్లతో కలిసి పని చేసింది సోనియా మాన్. నటిగా రాణిస్తూనే సోనియా మాన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు పంజాబ్‎లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు సోనియా మాన్. కాగా, 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

సీఎం భగంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరింది. మరో రెండేళ్లలో పంజాబ్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ పంజాబ్‎పై ఫోకస్ పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో.. 2027లో జరగనున్న పంజాబ్‎లోనైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు కేజ్రీ. ఇందులో భాగంగానే చేరికలపై దృష్టి సారించారు.