లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారందరినీ ఆదుకుంటూ యాక్టర్ సోనూసూద్ అందరిలోనూ మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఆయన సాయం కోరిన, కోరుతున్నవారందరినీ కాదనకుండా ఆదుకుంటున్నాడు. కష్టం ఎక్కడ ఉంటే సోనూసూద్ అక్కడే కనిపిస్తున్నాడు. తాజాగా సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచాడు. నగరంలోని హఫీజ్‌పేటకు చెందిన మారయ్య సరస్వతి దంపతుల కూతురు తేజశ్రీ(12) అనే బాలిక పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. బాలిక వైద్య ఖర్చులు, మందుల కోసం ప్రతి నెలా రూ. 20 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికే లక్షలు ఖర్చుపెట్టిన బాలిక తల్లిదండ్రులు.. ప్రస్తుతం డబ్బులు లేక మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కాగా.. మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న జేపీఎల్ కన్వెన్షన్‌లో సోనూసూద్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు శనివారం ఆయనను కలిశారు. తమ బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేదని వారు సోనూసూద్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో స్పందించిన సోనూసూద్.. బాలిక మందుల కోసం అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా.. బాలికకు గుండె మార్పిడి చేయాల్సివస్తే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు కూడా భరిస్తానని తెలిపాడు. దాంతో తేజశ్రీ మరియు ఆమె తల్లిదండ్రులు సోనూసూద్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ వైద్యానికి సాయమందించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.
For More News..