బ్యాంక్​ బ్యాలెన్స్​ పెంచుకోవడం కాదు.. ప్రజల మనస్సు గెలుచుకోవడం ముఖ్యం

బ్యాంక్​ బ్యాలెన్స్​ పెంచుకోవడం కాదు.. ప్రజల మనస్సు గెలుచుకోవడం ముఖ్యం

బషీర్ బాగ్, వెలుగు: కరోనా సమయంలో తన ఆలోచనా విధానం మారిందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృథానే అని అనిపించిందని సినీ నటుడు సోనూసూద్ తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణంలో గురువారం సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్​దివస్ కార్యక్రమంలో బల్గేరియా దేశ రాయబారి నికొళా యాంకోవ, నిర్వాహకుడు లయన్ కిరణ్ తో కలిసి సోనూసూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తాను పుట్టింది పంజాబ్ రాష్ట్రం అయినా తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 

తన భార్య తెలుగు మహిళేనన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదని, ప్రజల మనసులు గెలుచుకోవడం ముఖ్యం అని, అందుకోసం తన చివరి శ్వాస వరకు ప్రయత్నిస్తానని చెప్పారు. సుచిరిండియా ఫౌండేషన్ నిర్వాహకుడు లయన్ కిరణ్ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. లయన్ కిరణ్ మాట్లాడుతూ సోనూసూద్  సినిమాల్లో విలన్​పాత్రలు చేసినప్పటికీ నిజ జీవితంలో గొప్ప మానవతావాది అన్నారు. మానసిక , శారీరక వికలాంగులైన పిల్లలకు జీవించే హక్కు ఉంటుందని, రాష్ట్ర బడ్జెట్ లో వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం 2024 సంకల్ప్ దివస్ అవార్డును సోనూసూద్ కు అందజేసి ఘనంగా సన్మానించారు. పలు ఎన్జీఓ హోమ్స్ కు చెక్కులతోపాటు, వారికి అవసరమైన వస్తువులను సోనూసూద్ చేతుల మీదుగా అందించారు.