మారుమూల గ్రామానికి కాన్సంట్రేటర్‌ పంపిన సోనూ

అటు కరోనావైరస్.. ఇటు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారికి చేయూతనందిస్తూ హీరో సోనూసూద్ ఆదుకుంటున్నాడు. ఆయనకు ట్వీట్ చేసిన ఓ పల్లెటూరి వ్యక్తికి కూడా సాయమందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారి పేట గ్రామానికి చెందిన గొంది నాగేశ్వరరావు గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్నాడు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సాయంతో మెరుగైన చికిత్స పొందినా.. పూర్తిగా నయం కాలేదు. ఇంటివద్దనే ఆక్సిజన్ పెట్టుకుంటున్నాడు. కానీ మూడురోజులకొకసారి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడం.. నాగేశ్వరరావుకు ఆర్థికంగా భారమైంది. దాంతో ఈ విషయాన్ని ఆయన కుమారుడు కళ్యాణ్, మరి కొంతమంది యువకుల సహకారంతో.. సాయం కోరుతూ సోనూసూద్‌కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సోనూ స్పందించాడు. తన ఫౌండేషన్ నుంచి 39 వేల రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను పంపించి ఉదారతను చాటుకున్నారు. సోనూ చేసిన ఈ సాయంపై నాగేశ్వరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపి.. సోనూసూద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.