హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం లాంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభం లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్(Varun Sandesh). కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తాజాగా 'విరాజి'(Viraaji) చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించాడు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన "విరాజి" చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ విషయానికి వస్తే ::
రకరకాల కారణాలతో సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండ్ అప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది కొండమీద ఉన్న పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ మోసపోయి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ పడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు. దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉంటారు. ఆ టైంలో ఆండీ (వరుణ్ సందేశ్) వారి దగ్గరికి వస్తాడు. ఆండీ వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటపడింది ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read :- ఇష్టపడి కొన్న కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో
విశ్లేషణ::
సొసైటీలో ఇప్పుడున్న కాంటెంపరరి ఇష్యూస్ ని తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో..అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్‌తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. నిడివి తక్కువ ఉండడం సినిమాకు కొంత కలిసి వచ్చింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ ::
వరుణ్ సందేశ్ ఈ చిత్రంలోని పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఆండీ పాత్రలో తను పోషించిన తీరు ఆకట్టుకుంది. అయితే ఎమోషన్ పండించడం లో ఇంకా కేర్ తీసుకొంటే బాగుండేది. సిఐ మురళిగా బలగం జయరాం, సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తమదైన నటనతో మెప్పించారు.ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం ::
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యం. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ ఆ లొకేషన్ కోసం బాగా వర్క్ చేసారు. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక మాములు కథని ఇలా హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో చెప్పడం కొత్తగా అనిపించినా... స్క్రీన్ ప్లే మీద దర్శకుడు మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించారు.