తమిళగ వెట్రి కజగం ( టీవీకే) తొలి బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం చేపుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఆదివారం తమిళనాడులోని విల్లుపురం లో జరిగిన టీవీకే బహిరంగ సభలో విజయ్ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ఎంకే స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఒక కుటుంబం అండర్ గ్రౌండ్ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. దీనిపై డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది.
విజయ్ ఆరోపణలు నిరాధారమైనవి.. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ డీఎంకేపై అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని, విజయ్ ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
విల్లుపురం సభలో విజయ్ బీజేపీపై కూడా విరుచుకుపడ్డారు. ఇక్కడ ఒకేరాగం పాడే వర్గం ఉంది.. వారి ఎవరికైనా అదే రంగు పూయడానికి ప్రయత్నిస్తారు అని పరోక్షంగా విమర్శించారు. ఐక్యంగా జీవిస్తున్న తమిళ ప్రజలను మైనార్టీ, మెజార్టీ అంటూ విడగొట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు.
విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు సీనియర్ బీజేపీ నేత తమిళిసై సౌందర రాజన్.. డీఎంకే ను విజయ్ రాజకీయ శత్రువుగా చూడటం సంతోషంగా ఉంది.. కానీ బీజేపీ అభివృద్ది రాజకీయాలను విభజన రాజకీయాలుగు విజయ్ తప్పుగా అర్థం చేసుకున్నారనని అన్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడంతో తమిళ రాజకీయాల్లో కీలక మలుపుచోటు చేసుకుంది. కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను సీఎం చేయాలనుకుంటున్న ఎంకే స్టాలిన్ కు ఇది మింగుడుపడని విషయమే.. 2026లో ఎన్నికల్లో విజయ్, ఉదయనిధి స్టాలిన్ మీడియా ఫ్రంట్ ఫేసెస్ గా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.