ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే ఆరోగ్య సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గోఖలే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత అతని పరిస్థితి మెరుగుపడటంతో ఇంటికి తీసుకువెళ్లారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో.. మంగేష్కర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ గోఖలే 1971వ సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1990లో అమితాబ్ బచ్చన్ నటించిన అగ్ని పథ్, 1999లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ నటించిన 'హమ్ దిల్ దే చుకే సనమ్'తో సహా పలు మరాఠీ, బాలీవుడ్ చిత్రాలలో గోఖలే నటించారు. 2010లో మరాఠీ చిత్రం అనుమతిలో గోఖలే నటనకు 2010లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అతను మరాఠీ చిత్రం ఆఘాత్ కు దర్శకుడిగా పని చేశారు. ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైన అభిమాన్యు దస్సాని, శిల్పాశెట్టి నటించిన నికమ్మలో గోఖలే చివరిగా కనిపించారు.