మా నాన్న రియల్ హీరో
సినీ నటుడు స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా పాత తరానికే కాదు నేటి తరానికి కూడా పరిచయమే. కానీ, ఆయన రియల్ లైఫ్‌లో ఒక హీరో. పేద సినిమా కార్మికులకి ఇళ్లు కట్టుకునేందుకు చిన్నపాటి పోరాటమే చేసిన ఒక మాస్ హీరో. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ లైఫ్ జర్నీ గురించి ఆయన కూతురు శైలజా రెడ్డి మాటల్లో…
మీకు ఊహ తెలిసేటప్పటికే మీ నాన్నగారు యాక్టరా?
అవును. నాన్న మెడిసిన్ చదివేటప్పుడే అమ్మతో పెళ్లైంది. అప్పుడు అమ్మ వయసు పదేళ్లేనట నాన్నకి పద్దెనిమిదేళ్లు. నాన్నగారు ఇండస్ట్రీకి రాకముందే మా అక్కయ్య గంగ పుట్టింది. ఆ తర్వాత సినిమా ఛాన్స్ రావడంతో నాన్న మద్రాస్ షిఫ్ట్ అయ్యారు. ఆయన మొదటి సినిమా ‘చివరికి మిగిలేది’ షూటింగ్ టైంలోనే నేను పుట్టా. ఆ తర్వాత చెల్లెళ్లు శ్రీలక్ష్మి, విశాలాక్షి పుట్టారు. మేము పెరిగి పెద్దయ్యే టైంలోనే నాన్నగారు సినిమాలతో బిజీ అయ్యారు.
డాక్టర్ అయిన ఆయన యాక్టర్ ఎందుకయ్యారో ఎప్పుడైనా మీతో చెప్పారా?
నాన్న చిన్నప్పట్నించి కల్చరల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. స్పోర్ట్స్ పర్సన్ కూడా. థియేటర్ ఆర్టిస్ట్ కూడా. మెడిసిన్ చేస్తున్న టైంలో ఓ నాటకంలో ఆయన యాక్టింగ్ చూసి ‘చివరికి మిగిలేది’ ప్రొడ్యూసర్ పురుషోత్తం రెడ్డిగారు సినిమా అవకాశం ఇచ్చారు. దాంతో హైదరాబాద్ నుంచి మద్రాస్ షిఫ్ట్ అయ్యారు. అలాగని స్టడీస్‌ని పక్కనపెట్టలేదు. సినిమాలు చేస్తూనే డాక్టర్ పట్టా అందుకున్నారు. అది కూడా మెరిట్లో. ప్రొఫెషనల్‌గా డాక్టర్ అవ్వడం వల్ల అనుకుంటా ఆయన సినిమాల్లోనూ డాక్టర్‌గా అంత బాగా నటించగలిగారు.
మీ నాన్నగారు చేసే సోషల్ సర్వీస్ ఇంట్లో ఎప్పుడైనా సమస్యలు తెచ్చిపెట్టిందా?
లేదు. నాన్న స్వభావం, ఆయన ఆలోచనల వెనకున్న అంతరార్థం అమ్మకి తెలుసు. అందుకని అమ్మ కూడా నాన్నకి ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. నాన్న మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కొందరు గ్యారంటీ సంతకాలు తీసుకుని, అప్పులు తీసుకునేవాళ్లు. చివరికి అవన్నీ నాన్న నెత్తినే పడేవి. అలా రెండుకోట్ల వరకు నష్టపోయారు. అయినా సరే నాన్న తన చుట్టూ ఉన్నవాళ్ల గురించే ఆలోచించేవాళ్లు. మనం పదిమందికి మంచి చేస్తే ఆ మంచే మన పిల్లల్ని కాపాడుతుందని నాన్న నమ్మకం. మా అక్కాచెల్లెళ్ల విషయంలో అదే నిజమైంది. మా నాన్న మంచితనం మమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ వచ్చింది.
జయప్రద, జయసుధలకి స్ర్కీన్ పేరు పెట్టింది కూడా మీ నాన్నగారే కదా!
అవును. నాన్న రాజమండ్రిలో షూటింగ్ పూర్తిచేసుకుని తిరిగి మద్రాసు వస్తుంటే రైల్వే స్టేషన్లో జయప్రద వాళ్ల నాన్న కలిశారట. మా అమ్మాయికి సినిమాల్లో ఏదైనా వేషముంటే ఇవ్వండని అడిగారట. ట్రైన్ బయల్దేరే టైం అవ్వడంతో నాన్నగారు ‘‘సరే ట్రైన్ ఎక్కండి మాట్లాడదాం’’ అన్నారట. ఆ తర్వాత నాన్న ప్రొడ్యూస్ చేసిన ‘ నాకూ స్వతంత్రం వచ్చింది’ సినిమాలో జయప్రదకు అవకాశం ఇచ్చారు. ఆ టైంలోనే లలిత అనే పేరును జయప్రదగా మార్చారు. నిజానికి అది మా పెద్దమ్మ పేరు. అయితే ‘నాకు స్వతంత్రం వచ్చింది’ సినిమా కన్నా ముందే జయప్రద నటించిన రెండో సినిమా ‘భూమికోసం’ రిలీజ్ అయింది. ఇక జయసుధ విషయానికొస్తే ‘పండంటి కాపురం’ సినిమా తీస్తున్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లాస్ట్ మినిట్‌లో షూటింగ్‌కి రాలేదు. ఆ టైంలో అక్కడే ఉన్న జయసుధని గమనించి వేషం ఇచ్చారు నాన్న. జయసుధ, విజయనిర్మల బంధువు. ‘జయ’ అనే పేరు ముందు రావాలని సుజాత అనే పేరుని ‘జయసుధ’గా మార్చారు.
మీ నాన్నగారు 70ల్లో టాప్ హీరోలందరితో నటించారు. సినిమాలు తీశారు .వాళ్లతో అనుబంధం ఎలా ఉండేది?
మ్యాగ్జిమమ్ సినిమాలు శోభన్‌బాబు, కృష్ణగారితోనే చేశారు. వాళ్లిద్దరూ నాన్నకి చాలా క్లోజ్. కృష్ణగారు, నాన్న అయితే జంటపక్షుల్లా ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లు. ఎన్టీరామారావు, నాగేశ్వరరావు గార్లతో కూడా నాన్నకి మంచి రిలేషన్ ఉండేది. మా చిన్నప్పుడు రెగ్యులర్‌గా వాళ్లంతా మా ఇంటికి వచ్చి, పోతుండేవాళ్లు. ఆ జనరేషన్లో హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లు. ఆ తరువాతి తరంలో మోహన్‌బాబుగారు నాన్నకి చాలా క్లోజ్.
షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డిగారు సడెన్‌గా అందరికీ దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా?
షూటింగ్ హడావిడితోపాటు పేద సినీ కార్మికుల బాగోగుల్లో పడి ఆయన ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఆయన చనిపోవడానికి ముందురోజు కూడా కామ్రేడ్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. చివరి మాటల్లో కూడా సినిమా షూటింగ్లో కార్మికుల్ని పట్టించుకోవట్లేదు. వాళ్లకి సరిగా ఫుడ్ పెట్టట్లేదని వాళ్ల గురించే బాధపడ్డారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి పేపర్ చదువుతూ స్పృహ కోల్పోయారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే షుగర్ వల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అలా అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసి వెళ్లడం పెద్ద షాక్. దాన్నుంచి తేరుకోవడానికి చాలాకాలం పట్టింది. నాన్న మామధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి అలానే బతికి ఉంది. ఇప్పటికీ ‘‘మీ నాన్నగారి వల్లే ఇండస్ట్రీలో ఉన్నా..మీ నాన్నగారి వల్లే నాలుగు మెతుకులు తింటున్నాం’’ అని అంటుంటారు చాలామంది.
సినిమాల పరంగా నాన్నగారు నిరుత్సాహ పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
నాన్న నిర్మించిన ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ సినిమా కథ, స్క్రీన్ ప్లే పరంగా బాగానే ఉన్నా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆ రోజుల్లో పది లక్షల వరకు నష్టపోయారు. నాన్న సినిమాలకి తీసుకునే రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఆ నష్టం పెద్ద విషయమేకాదు. కానీ, ఆ సినిమా ఎందుకు ఆడలేదని కాస్త నిరుత్సాహ పడ్డారు. ఫెయిల్యూర్‌కి కారణాల్ని ఎనాలిసిస్ చేసి భవిష్యత్తులో అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత రిలీజ్ అయిన ‘ ధర్మచక్రం, భారతంలో శంఖారావం’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాన్న ప్రొడ్యూస్ చేసిన 27 సినిమాల్లో ‘నాకూ స్వతంత్రం వచ్చింది, ఇంటింటా దీపావళి’ అనే ఒక చిన్న బడ్జెట్ సినిమా మినహా అన్నీ సూపర్ హిట్లే.
కార్తీక దీపం సినిమాలో చీరని డిజైన్ చేసింది మీ అమ్మగారేనట!
నాన్న ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నింటికి విమెన్ క్యారెక్టర్ల కాస్ట్యూమ్స్ అన్నీ అమ్మ సంయుక్త చూసుకునేది. ప్రతీ సినిమాకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న శారీస్ డిజైన్ చేసింది. అప్పట్లోనే జమున కోసం బెనారస్ శారీస్ని డిజైన్ చేసింది అమ్మ . ‘కార్తీక దీపం’ సినిమాలో శ్రీదేవి కట్టుకున్న చీర అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ‘‘కార్తీకదీపంలో శ్రీదేవి కట్టుకున్న బ్లాక్ శారీకి, గ్రీన్ బోర్డర్ మాకూ కావాలంటూ’’ షాప్‌ల ముందు‘ క్యూ’ కట్టారు జనాలు. ఇప్పటికీ షాపుల్లో కార్తీక దీపం చీరలు ట్రెండింగ్.
స్ర్కీన్ మీద విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసేవాళ్లు కదా! మరి రియల్ లైఫ్‌లో ఎలా ఉండేవాళ్లు?
రియల్ లైఫ్‌లో నాన్న చాలా సెన్సిటివ్ . ఇతరుల పట్ల దయగా ఉండాలని ఎప్పుడూ చెప్తుండేవారు మాకు. ‘‘లేనివాడికి మనకు ఉన్నదాంట్లో పదిరూపాయలు తీసిస్తే ఏమవుతుందనేది’’ ఆయన వాదన. ఆయన చివరి రోజు వరకు పేద వాళ్ల కడుపునింపాలనే తపన పడ్డారు. సినీ కార్మికుల కోసం ఏ స్టార్ హీరో చేయని పోరాటాన్ని నాన్న చేశారు.. నిజానికి ఆయన జీవితాన్ని ఓ సినిమా తీయొచ్చు.
ఆ ఆలోచన ఏమైనా ఉందా మరి?
ప్రేమలు, ఆప్యాయతలంటే ఈరోజుల్లో ఎవరు చూస్తారు? ఇప్పుడంతా కమర్షియల్ ఫార్ములా సినిమాలే నడుస్తున్నాయి కదా..
నాన్నగారి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి ఏంటి?
ఒక్కటని చెప్పలేను. ఆయన నటించి, నిర్మించిన, డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా నా ఫేవరెట్. మరీ ముఖ్యంగా ఆయన కథ అందించిన ‘పండంటి కాపురం’ నా ఆల్ టైం ఫేవరెట్. నిజానికి ఆ సినిమా కల్పిత కథ కాదు. నాన్న జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఆ సినిమా రాశారు. నాన్నకి వాళ్ల అన్నదమ్ములతో ఉన్న అనుబంధం, వాళ్లు జీవితంలో ఎదుర్కొన్న అప్ అండ్ డౌన్స్.. అవే ‘పండంటి కాపురం’. అలాగే ఆయన రాసిన ‘కార్తీకదీపం, గృహాప్రవేశం, ధర్మాత్ముడు, పచ్చని సంసారం’ సినిమాల్ని రెగ్యులర్‌గా చూస్తుంటా.
నాన్నలో మీకు నచ్చేవి ఏంటి?
‘ఎదుటి వ్యక్తి బాగుండాలి’ అనే ఆలోచన తప్ప స్వార్థం కనిపించదు నాన్నలో. ఎప్పుడూ పేదవాళ్ల బతుకుల్ని బాగుచేయాలనే తపన పడుతుంటారు. సాయం అంటూ ఎవరు చెయ్యి చాచినా వెనకాముందు ఆలోచించకుండా ఆపద నుంచి గట్టెక్కించేవారు. మేము మద్రాసులో ఉన్నప్పుడు ‘‘సినిమా అవకాశం ఇప్పించమ’’ని రోజుకి ఇద్దరుముగ్గురైనా మా గేటు ముందు నిల్చునేవాళ్లు. వాళ్లని చేరదీసి కడుపునిండా భోజనం పెట్టి, ప్రతిఒక్కరికీ ఖర్చులకి డబ్బులిచ్చి పంపేవాళ్లు. నాన్నలోని ఆ దయాగుణం నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌లోని ‘చిత్రపురి కాలనీ’ కూడా ఆయన దయాగుణానికి ఒక నిదర్శనమే.
చిత్రపురి కాలనీకి దానమిచ్చిన భూమి తాతలకాలం నాటిదా?
ఆ భూమి నాన్న కష్టార్జితమే. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినప్పుడు పేరున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో పెద్దపెద్ద స్టూడియోలే కట్టుకున్నారు ఆ కాలం అగ్రనటులందరూ. అయితే ఆ టైంలో 24 ఫ్రేమ్స్‌లో చిన్నాచితకా పనులు చేస్తూ పొట్ట నింపుకునే టెక్నీషియన్స్‌ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మద్రాసునుంచి హైదరాబాద్ వచ్చిన కాస్ట్యూమ్ డిజైనర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మేకప్ ఆర్టిస్ట్‌లు సరైన వసతులు లేక ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. నాన్నగారు ఆ టైంలో వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉండటంతో వాళ్లకోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. తనకి ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా వద్దనుకున్నారు. ట్విన్సి అనే క్లబ్ ఏర్పాటు చేసి 300 మంది పేద కళాకారులకు ప్రతిరోజూ ఫుడ్ పెట్టారు. వాళ్ల హెల్త్ కేర్ని కూడా చూసుకున్నారు. వృద్ధ కళాకారుల కోసం 500 రూపాయల పెన్షన్‌ని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం చుట్టూ తిరిగి మణికొండలో సినీకార్మికుల కోసం భూమిని కేటాయించేలా చేశారు. 1994లో చిత్రపురి శంఖుస్థాపన జరిగింది. అలాగే ఆయన కష్టార్జితం పదెకరాల భూమిని కూడా చిత్రపురి కాలనీ కోసం ఇచ్చేశారు. ఇప్పుడు దాని ఖరీదు కొన్ని వందల కోట్లు ఉంటుంది.
‘అయ్యో వాళ్లకి లేదే’.. అన్న ఆలోచననే నాన్నతట్టుకోలేకపోయేవారు. ‘నా చుట్టూ ఉన్నవాళ్లు హ్యాపీగా ఉండాలి. అందుకోసం నేనేం చేయాలి’ అనే ఆలోచిస్తుండేవారు. నాన్నకి దేవుడంటే చాలా భక్తి. ఖాళీ టైం దొరికితే పూజ గదిలోనే ఉండేవారు. శివుడ్ని ఎక్కువగా ఆరాధించేవారు. కార్తీకమాసంలో ఘనంగా శివుడికి పూజలు చేసేవారు.
– ఆవుల యమున
For More News..