పార్టీ మద్దతుపై తీవ్ర అసంతృప్తి.. బీజేపీకి నటి గౌతమి రాజీనామా

ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అధికారికంగా రాజీనామా చేశారు. పార్టీలో మద్దతు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె నిష్క్రమణ తమిళనాడులో రాజకీయ పరిణామాలపై చర్చలకు ఆజ్యం పోసింది.

రాజీనామాతో పాటు గౌతమి సి. అళగప్పన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను తనను మోసం చేశాడని, ఫలితంగా ఆమె తన డబ్బు, ఆస్తి, ముఖ్యమైన పత్రాలను కోల్పోయిందని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన గౌతమి.., తన పోరాటం తనకు న్యాయం చేయడమే కాకుండా తన బిడ్డ భవిష్యత్తు కోసం కూడా అని నొక్కి చెప్పారు.

“ఈ రోజు నేను నా జీవితంలో ఊహించలేనిది. పార్టీ, నాయకుల నుంచి నాకు ఎటువంటి మద్దతు లేదని మాత్రమే కాకుండా, వారిలో చాలా మంది చురుకుగా సహాయం, మద్దతు ఇస్తున్నారని కూడా నాకు తెలుసు. నా నమ్మకాన్ని ఒమ్ము చేసన వ్యక్తి…” అని ఆమె తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.

బీజేపీతో గౌతమి ప్రయాణం

2021లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో తన ప్రమేయాన్ని కూడా గౌతమి గుర్తు చేసుకున్నారు. పార్టీ మొదట ఆమెకు రాజపాళయం నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను అప్పగించింది. ఆమెకు సీటు హామీ ఇచ్చింది. కానీ సీటును చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారని, దీంతో నిరుత్సాహానికి గురయ్యామని ఆమె వాపోయారు.

Also Read : దిగజారుతున్న గాలి నాణ్యత.. ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని

ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ, తాను పార్టీకి విధేయురాలిగా ఉన్నానని ఆమె నొక్కి చెప్పారు. తనకు పార్టీలో పూర్తి మద్దతు లేదని ఆమె తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిన తర్వాత కూడా గత 40 రోజులుగా పార్టీ సీనియర్ నాయకులు సి.అళగప్పన్‌ న్యాయం చేయకుండా తప్పించుకుని పరారీలో ఉన్నారని గౌతమి ఆరోపించారు.