
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమను సీసీబీ పోలీసులు జూన్ 4న కోర్టులో హాజరుపర్చనున్నారు. దీంతో ఇవాళ రాత్రి(జూన్3) బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ ఆఫీసులోనే ఉండునున్నారు హేమ.
మే 19న రాత్రి బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో నటి హేమకు రక్తనమూనాలో పాజిటివ్ వచ్చింది. దీంతో మే 27న విచారణకు హాజరుకావాలని హేమకు పోలీసులు నోటీసులిచ్చారు. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు ఆమె లెటర్ రాశారు. దీంతో మరోసారి హేమకు నోటీసులిచ్చారు. జూన్ 1న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయినా విచారణకు హాజరుకాకపోవడంతో విసుగొచ్చిన పోలీసులు మరోసారి నోటీసులిచ్చేందుకు ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ విచారణకు హాజరైన హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. అయితే మీడియా కంట పడకుండా ఉండేందుకు హేమ .. వైద్య పరీక్షలకు బుర్ఖాలో వచ్చిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి.