
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ తన మౌనాన్ని వీడారు. గురువారం (ఏప్రిల్ 24), నటి సోషల్ మీడియాలో ఈ దారుణమైన సంఘటనను ఖండిస్తూ ఒక సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు తన దృష్టిలో అసలు మనుషులే కాదని తెలిపింది.
హీనా స్వయంగా కాశ్మీరీ. గత కొంతకాలంగా నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతోంది. ఇటీవలే చికిత్స తీసుకుని విరామం కోసం కాశ్మీర్‌లోని తన స్వస్థలానికి వెళ్లింది. పహల్గాం దాడి మధ్య ఆమె చికిత్స కోసం ముంబైకి తిరిగొచ్చింది. అంతలోనే ఈ ఘటన జరగడంతో ఓ ఎమోషనల్ నోట్ రాసి, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.
‘ముస్లింలమని చెప్పుకునే హృదయం లేని, అమానుషమైన, బ్రెయిన్ వాష్ చేసిన ఉగ్రవాదులు ఈ దాడి చేసిన విధానం చాలా దారుణం. తమను తాము ముస్లింలుగా చెప్పి.. ఎదుటి వారిపై కరుణ చూపకుండా కాల్పులు జరిపిన విధానం భయంకరమైనది. దీన్ని ఖండిస్తున్నాను. అది నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మరియు ఒక ముస్లింగా, నా తోటి హిందువులందరికీ మరియు నా తోటి భారతీయులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సంతాపం తెలుపుతున్నాను. అది ఓ చీకటి రోజు. కనీసం మానవత్వం లేకుండా ఈ దాడికి పాల్పడ్డారు. "దీనికి బేషరతుగా ప్రతీకారం తీర్చుకోవాలనే భారతదేశం యొక్క సంకల్పానికి’తాను మద్దతు ఇస్తానని హీనా చెప్పింది.
అలాగే హీనా ప్రస్తావిస్తూ.. ‘ఇలా చేసిన వారు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు. వారు నాకు మనుషులు కాదు. కొంతమంది ముస్లింల చర్యకు నేను ఎంత సిగ్గుపడుతున్నాను. మతాలు, కులాల కంటే ముందు మనమందరం భారతీయులమని, మనం ఒక్కటిగా కలిసి రావాలి. ఈ ఘటనపై ఎవ్వరూ రాజకీయాలు చేయొద్దు. విభజనలు వద్దు. ద్వేషం వద్దు. ఏదైనా సరే. మనం ముందుగా భారతీయులం. జై హింద్ ’ఆమె ముగింపు మాటలు మానవత్వాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి.
Peace and Love
— Hina Khan (@eyehinakhan) April 24, 2025
Jai Hind 🇮🇳 pic.twitter.com/q7e8uAR8A9
ప్రస్తుతం నటి హీనా ఖాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె నోట్ ద్వారా ఇచ్చిన సందేశం నెటిజన్లతో పాటుగా ఆమె అభిమానులను ఆకట్టుకుంది. నిజాయితీ, కరుణ మరియు సంఘీభావంతో ఇచ్చిన ఈ పిలుపుకు సోషల్ మీడియాలో విస్తృత మద్దతు లభిస్తుంది. అందరూ మీలా ఆలోచిస్తే ఈ విద్వేష ఘటనలు జరగవని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అలాగే, మీరు మీ ఆనారోగ్యాన్ని జయించి, త్వరగా మాములు స్థితికి రావాలని ఆశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే హీనా కెరీర్ విషయానికొస్తే.. పలు ప్రయివేట్ సాంగ్స్, బిగ్ బాస్ హిందీ 14వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అలరించింది. ఆ తర్వాత 6కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇందులో "హ్యక్డ్' అనే సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే నాగిన్, ఇండియన్ ఐడల్, యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్, షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది.