హైదరాబాద్, వెలుగు: తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని నార్సింగిలో పుప్పాలగూడ బీఆర్సీ బిల్డింగ్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చి ట్రాన్సిట్ వారంట్ పై చెన్నైకి తరలించారు. తెలుగు మహిళలపై కస్తూరి వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజుల కాలంలో తమిళనాడులో అంతపురంలోకి సేవకులుగా వచ్చినవాళ్లే తెలుగు మహిళలని, వాళ్లు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి.
ఈనెల 3న చెన్నైలో జరిగిన ఓ బ్రాహ్మణ సమాజం సమ్మేళనం కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలుగు మహిళలు తమిళనాడుకు వచ్చి అంతఃపురం, రాజమందిరాల్లో సేవకులుగా పనిచేసేవారని అన్నారు. ఎప్పుడో తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంతవాదులపై కస్తూరి తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలోనూ ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. చెన్నై ఎగ్మోర్ లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదుతో నాలుగు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్లగా.. ఆమె ఇంటికి తాళంవేసి ఉంది. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో కస్తూరి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై పోలీసులు తమిళనాడు సహా హైదరాబాద్ లోనూ గాలించి ఆమెను అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారంట్ పై తమిళనాడుకు తీసుకెళ్లారు.