వివాదంలో నటి కస్తూరి.. అసలేం జరిగింది..? ఏంటి ఈ కథ..?

వివాదంలో నటి కస్తూరి.. అసలేం జరిగింది..? ఏంటి ఈ కథ..?

నటి కస్తూరి.. నటి కస్తూరి.. గత 24 గంటలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీనియర్ న‌టి గురించే చర్చంతా. కస్తూరి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కొందరు, ఆమెను తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అంతలా ఆమె ఏం చేసిందంటారా..! తెలుగు ప్రజలను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారి గురించి, తెలుగు జాతి గురించి తమిళగడ్డపై ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడింది.

అసలు ఏం జ‌రిగిందంటే..?

త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ సభ‌లో పాల్గొన్న కస్తూరి.. రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని వ్యాఖ్యానించింది. 

ALSO READ : Salman Khan: హైద‌రాబాద్‌లో స‌ల్మాన్.. ఫలక్ నుమా ప్యాలెస్లో సికందర్.. వీడియో వైరల్

"300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?" అని నటి కస్తూరి పరోక్షంగా ద్రావిడ వాదులను ప్రశ్నించింది. పోనీ, అంతటితో ఊరుకుందా..! లేదు. "ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నందునే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం జరుగుతోంది.." అని వ్యాఖ్యానించింది. ఇంతలా ఈమె నోరు చించుకోవడానికి కారణం.. తానొక బ్రాహ్మణ మహిళ.

కస్తూరి బ్రాహ్మణులను పొగడాలనుకుంటే.. ఆ తరహా వ్యాఖ్యలు చేయాలి కానీ, తెలుగు వారిని కించపరచడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.   

నేను అమాయకురాలిని..: నటి కస్తూరి

ఈ వివాదం కాస్త ముదురుతుండడంతో నటి కస్తూరి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుంది. తెలుగుప్రజల గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. డీఎంకే పార్టీ వాళ్లు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనకు రెండు కళ్లు లాంటి వారని.. తనపై ఎంతో అభిమానం చూపుతున్నారని వివరించింది. ఆ ప్రేమను దూరం చేసేందుకు డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చుకుంది.