కోల్‌కతా వైద్యురాలి ఘటనపై నిరసన.. రేప్ చేస్తామని నటికి బెదిరింపులు

కోల్‌కతా వైద్యురాలి ఘటనపై నిరసన.. రేప్ చేస్తామని నటికి బెదిరింపులు

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం- హత్య ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ మహిళలు, డాక్టర్లు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాశవిక ఘటనను నిరసిస్తూ తమ గళాన్ని వినిపించిన ఓ నటికి రేప్ బెదిరింపులు వచ్చాయి. 

కోల్‌కతా వైద్యురాలి రేప్-హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత తనకు అత్యాచారం బెదిరింపులు, అసభ్యకరమైన సందేశాలు ముంచెత్తాయని తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత, నటి మిమీ చక్రవర్తి వెల్లడించింది. ఈ బెదిరింపులపై సహాయాన్ని కోరుతూ ఆమె కోల్‌కతా పోలీస్ సైబర్ సెల్ విభాగానికి ట్యాగ్ చేసింది.

నిరసనల్లో పాల్గొన్న మిమీ చక్రవర్తి

అంతకుముందు మిమీ చక్రవర్తి కోల్‌కతా వైద్యురాలి రేప్-హత్య కేసులో త్వరగతిన న్యాయం జరగాలని మహిళలు చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. వైద్యురాలిపై అత్యాచారం- హత్య చేయడమన్నది అత్యంత దురదృష్టకరమన్న నటి, ఈ వ్యవహారంలో సత్వర న్యాయం కావాలని మహిళలు, సోదరులు కోరుతున్నారని మాట్లాడారు. కోల్‌కతా ఇలాంటి నేరాలకు అడ్డా కాదని, వీటిని సభ్యసమాజం ఆమోదించదని మిమీ చక్రవర్తి స్పష్టం చేశారు.