‘కబాలి’లో రజనీ​ ​కూతురు గుర్తుందా..? ప్రెజెంట్ ఏం చేస్తోందంటే..

‘కబాలి’లో రజనీ​ ​కూతురు గుర్తుందా..? ప్రెజెంట్ ఏం చేస్తోందంటే..

‘కబాలి’ సినిమాలో రజనీకాంత్​ ​కూతురి పాత్రలో నటించిన నటి సాయి ధన్షిక. ఆ ఒక్క పాత్రతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్స్ సీన్స్​లో డైనమిక్​ లేడీగా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే.. ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ధన్షిక. ‘ఐందమ్​ వేదం’ అనే వెబ్​ సిరీస్​తో మరోసారి తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులోనూ ఓ వెరైటీ క్యారెక్టర్​లో కనిపించి తన మార్క్​ చూపించింది. పదేండ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ధన్షిక జర్నీలో ఇంట్రెస్టింగ్​ విశేషాలు ఇవి.
 

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా.. 

‘పేరాన్మై’ సినిమాలో నేను ఎన్​సీసీ క్యాడెట్​గా నటించా. ఆ సినిమా కోసం ఆరు నెలలు యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నా. ఖాళీ టైం దొరికితే కళరి, సిలంబం, జిమ్నాస్టిక్స్ వంటివి చేస్తుంటా. అవి నా క్యారెక్టర్​కి కూడా ఉపయోగపడతాయి. ఏ క్యారెక్టర్​కి అయినా రెడీగా ఉండాలని నేను నేర్చుకుంటున్నా. ‘కబాలి’ ఆడిషన్స్​కి వెళ్లాను. రజనీకాంత్​ సినిమా కాబట్టి ఏదో ఒక రోల్ వస్తే బాగుండు అనుకున్నా.

అప్పటికి నేను వేరే సినిమాల్లో చేస్తున్నా. ఫొటోషూట్ చేశాక ఒక క్యారెక్టర్​కి నన్ను ఓకే చేశారు. అది రజనీకాంత్ కూతురు రోల్ ‘యోగి’. అందుకోసం హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పారు. వెంటనే సరే అన్నాను. అయితే, డైరెక్టర్​ నా ఎగ్జయిట్​మెంట్ చూసి.. మరేం పర్లేదు. మిగతా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాకే రమ్మన్నారు. అవి కంప్లీట్ చేసి కబాలి షూటింగ్​కి వెళ్లా. 

రజనీకాంత్​ కూతురిగా గుర్తింపు

‘కబాలి’ షూటింగ్ అయిపోయాక వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియా వెళ్లాను. రిలీజ్​ టైంకి అక్కడే ఉండడంతో థియేటర్​కి వెళ్లి సినిమా చూశా. మలేసియాలో తమిళులు ఎక్కువగా ఉంటారు. అయితే అప్పటికీ నేను అదే కటింగ్​తో ఉన్నాను. అయినా లోపలికి వెళ్లేటప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ, బయటికి వచ్చేటప్పుడు మాత్రం జనాలు నా చుట్టూ వచ్చేశారు. బయటికి రావడానికి ఇబ్బంది పడిపోయా. ఆ ఎక్స్​పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఒక సెలబ్రెటీకి కావాల్సింది గుర్తింపు.. అది దొరికినప్పుడు అంతకంటే సంతోషం ఏం ఉంటుంది?


లైన్ దాటి వెళ్లను 

ఏ మూవీలో అయినా ఒక సీన్​కి ఎంత అవసరమో అంతవరకే నటిస్తాను. బోల్డ్ సీన్స్​లో కనిపించినంత మాత్రాన నేను బోల్డ్ అని కాదు. ఆ సీన్​ తీసే విధానం వేరుగా ఉంటుంది. అలాగే కథకు అవసరం అయితే చేయాల్సి వస్తుంది. నటికి కంఫర్ట్ ఉంటేనే అలాంటివి తీయడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా ‘దక్షిణ’ సినిమా విషయానికొస్తే.. షూటింగ్​ చేసేటప్పుడు నా బాడీ ఫుల్​ కవర్​ అయ్యే ఉంటుంది.

సీన్​కు ఎంత ఇంటెన్సిటీ కావాలో ఆ విధంగా కెమెరాలో చూపిస్తారు. దాన్ని ఆడియెన్స్​ సరిగా అర్థం చేసుకోవాలి. సిగరెట్ కాల్చడం కూడా అంతే. నాకు స్మోకింగ్​అలవాటు లేదు. ఈ సినిమాలో సిగరెట్ తాగే సీన్​ చేసేటప్పుడు కూడా ఇబ్బందిపడ్డాను. ఆ సీన్ కోసం రోజుకు రెండు ప్యాకెట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అందరూ తాగేవి కాదు అవి. అలా నాకంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక లైన్​ పెట్టుకుంటాను. ఆ లైన్​ దాటి వెళ్లను. 

తెలుగుతో కనెక్షన్ అలా..

సినిమాల్లోకి రాకముందు నుంచే తెలుగు మూవీస్ చూసేదాన్ని. అలా తెలుగు నేర్చుకున్నా. హైదరాబాద్​కి వస్తే.. అందరూ తెలుగు మాట్లాడుతుంటారు. కాబట్టి ఆటోమెటిక్​గా నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇక్కడ ఇంకా మంచి సినిమాల్లో నటించాలనుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాలన్నీ థియేటర్స్​లో చూడడం చాలా మంచి విషయం. వాళ్లలో యూనిటీ ఉంది. ‘షికారు’ లేదా ‘దక్షిణ’ ఏ సినిమా అయినా ప్రొడ్యూసర్స్ పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ వస్తున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలను కూడా ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. 

సోషల్ మీడియా ఇష్టం ఉండదు 

ఇప్పుడు సోషల్ మీడియా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నేను చేసే పని సినిమాల్లో కనిపిస్తుంది. దాన్ని చూసి అభిమానిస్తే చాలు అనుకుంటాను. ఒకసారి కోపం వచ్చి ఇన్​స్టా డిలీట్ కూడా చేశా. కానీ, నా సినిమాల కోసం మళ్లీ రీస్టార్ట్ చేశా. నా పర్సనల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్​గా ఉంటుంది. రియాలిటీ షోలలో నాలాంటి వాళ్లు చేయలేరు. తెలుగు, తమిళంలో నాకు అవకాశం వచ్చినా నేను ‘నో’ చెప్పాను. అలాగే పబ్లిక్ ప్లేస్​ల్లో నాకు తెలియకుండా వెనుక నుంచి ఫొటోలు తీస్తే నాకు నచ్చదు.

వెంటనే ‘తీయొద్దు’ అని చెప్పేస్తా.” 

‘‘మాది తమిళనాడులోని తంజావూరు. నా పేరు ధన్షిక. ఇండస్ట్రీకి వచ్చాకే సాయి అనేది యాడ్ చేసుకున్నా. నేను చాలా సింపుల్​ ఫ్యామిలీ నుంచే వచ్చా. మా అమ్మ హిందూ, నాన్న క్రిస్టియన్. నేను అన్ని మతాలను, వాళ్ల ఆచారాలను గౌరవిస్తాను. దేవుడిపై నమ్మకం ఉంది. నాకు మూడేండ్ల వయసున్నప్పుడే నాన్న కువైట్​ వెళ్లారు. అక్కడే16 ఏండ్లు ఏసీ మెకానిక్ సూపర్​వైజర్‌‌గా పనిచేశారు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికే వచ్చేయమని చెప్పా. ఇప్పుడు అందరం ఒకేచోట ఉంటున్నాం. చిన్నప్పుడు అథ్లెట్ అవ్వాలనుకునేదాన్ని.

స్కూల్లో ఫుట్​బాల్ టీంకి కెప్టెన్‌ని కూడా. స్పోర్ట్స్ కాంపిటీషన్​లో15 మెడల్స్ అందుకున్నా. మా ఫ్యామిలీలో కూడా ఎవరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు లేరు. మా రిలేటివ్స్​లో మాత్రం ఒక అంకుల్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నా. సినిమాల్లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్​లో కనిపిస్తాను. కానీ, బయట నేను చాలా నార్మల్​గా, సింపుల్​గా ఉంటా. నిజానికి మేకప్​ లేకుండా ఉండడమే నాకు ఇష్టం. కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రమే అవసరం కాబట్టి మేకప్ వేసుకుంటాను. 

ఫస్ట్ సిరీస్​ ఇదే ఎందుకంటే..

‘‘12 ఏండ్లుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ఇప్పటివరకు నా జర్నీ చాలా బాగుంది. ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని లేదు. నేను సినిమాల గురించి కంటిన్యూగా ఆలోచిస్తూనే ఉంటాను. మరోలా చెప్పాలంటే.. సినిమానే నా జీవితం. ‘ఐందమ్ వేదం’ నాకు మంచి ఎక్స్​పీరియెన్స్ ఇచ్చింది. మొదట్లో నన్ను నేను పెద్ద స్క్రీన్​పై చూసుకోవాలి అనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చా. అయితే అనుకోకుండా ప్యాండమిక్ రావడంతో అంతా మారిపోయింది.

ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఎంట్రీ ఇచ్చాయి. దాంతో ఇప్పుడు ఇలా అనిపిస్తుంది.. మీడియం ఏదైతే ఏంటి? ఎందులోనైనా మన ఇంపాక్ట్​ చూపించాలి అంతే అని. ఈ క్రమంలో ఇప్పటివరకు వెబ్​ సిరీస్​లో నటించడానికి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నేను దేనికీ ఒప్పుకోలేదు. కానీ, డైరెక్టర్​ నాగ నుంచి నాకు కాల్​ రాగానే నటించడానికి ‘ఓకే’ చెప్పా. అందుకు కారణం... ఆయన ఇంతకుముందు తీసిన ‘మర్మదేశం’ అనే సిరీస్​కి నేను పెద్ద అభిమానిని. పైగా నేను నటించే సిరీస్​ విషయానికొస్తే.. ఇందులో నా క్యారెక్టర్​కి చాలా లేయర్స్ ఉన్నాయి. డైరెక్టర్​ తన వర్క్​ని చాలా బాగా ప్రజెంట్​ చేస్తారని నాకు తెలుసు.’’

కష్టపడి పనిచేస్తాం

‘‘సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి మన కంట్రోల్​లో ఉండవు. కానీ, నేను చేసిన సినిమాలు రిలీజ్ లేట్ అవ్వడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్​ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తాం. తర్వాత మరో దానికి కోసం వెయిట్ చేస్తుంటాం. మొదటిది విడుదల అయితేనే రెండోది చేయగలుగుతాం. ఫెయిల్యూర్స్ చాలా నేర్పిస్తాయి. ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుంది. అవన్నీ పక్కనపెడితే నేను బయటికి వెళ్తూనే ఉండాలి. ఎంత బాగా చేయగలిగితే అంత బాగా పనిచేయాలి. తర్వాత రిజల్ట్​ని ఆడియెన్స్​కి వదిలేయాలి. చాలామంది చాలా చెప్తారు. కానీ నాకు నేను సెల్ఫ్​గా పరిశీలించుకుంటాను.’’

ఆ లుక్​  ‘దక్షిణ’లో రిపీట్​..

‘కబాలి’ సినిమాలో నేను చేసిన ‘యోగి’ క్యారెక్టర్ అంటే డైరెక్టర్ ఓషో తులసిరామ్​కి బాగా ఇష్టం. ఆ లుక్​లో ఆయన సినిమాలో ఏదైనా అలాంటి క్యారెక్టర్​ చేయించాలని అనుకున్నారట. కథ బాగుండడంతో అలాంటి పాత్రలో మళ్లీ కనిపించడానికి కూడా ఒప్పుకున్నా. ఎందుకంటే కథలు, పాత్రలు వేరుగా ఒకేలా ఉండకుండా చూసుకోవడం నా బాధ్యత. దీనివల్ల నేను పెద్దగా ఎఫెక్ట్ అవ్వను. అయితే నేను అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తానని చెప్పట్లేదు. గ్లామర్, డాన్స్ ఉండే పాత్రలు కూడా చేస్తాను. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. ఇలాంటి క్రియేటివ్​ ఫీల్డ్​లో ఉంటే అవి ఉపయోగపడతాయి.