అభిమానులకు అనురాగ దేవత.. శ్రీదేవి ఏడో వర్ధంతి ప్రత్యేకం

అభిమానులకు అనురాగ దేవత.. శ్రీదేవి ఏడో వర్ధంతి ప్రత్యేకం

ఎన్టీ రామారావు, శ్రీదేవి జంటగా నటించిన జస్టిస్​ చౌదరి సినిమా మే 28, 1982లో విడుదలైంది.  ఈ సినిమాలో ఒక యుగళ గీతానికి పల్లవి ‘ఒకటో నంబరు చిన్నదంట, ముద్దుగా బొద్దుగా ఉన్నదంట’ అని సినిమా పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి రాశారు. ఆ తరువాత అదే జంటతో వచ్చిన బొబ్బిలిపులి జులై 9, 1982లో విడుదలవగా ఈ సినిమాలో పాటకు  మళ్లీ వేటూరినే రచయితగా ‘ఇది ఒకటో నంబరు మిస్సూ’ అంటూ పల్లవిని రాశారు. ఈ మాటలు శ్రీదేవి విషయంలో అక్షరాల నిజం అయ్యాయి. ఆమె దేశంలో మహిళా సూపర్​స్టార్​గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, జాతీయ ఉత్తమనటి, ఉమ్మడి ఏపీలో నంది అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమనటి, ఫిల్మ్​ఫేర్​ నుంచి ఆరుసార్లు ఉత్తమనటి పురస్కారాలు, జీవనకాల సాఫల్య అవార్డులు ఆమెను వరించాయి. 

శ్రీదేవి తమిళనాడులోని మీనంపట్టి అనే ఊళ్లో ఆగస్టు 13, 1963లో పుట్టారు. మీనంపట్టి గ్రామం విరుధునగర్​ జిల్లా శివకాశి తాలూకాలో ఉంది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి కొన్ని తెలుగు సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్​ న్యాయవాది. దండాయుధపాణి ఫిల్మ్స్​ అధినేత శాండో ఎంఎంఎ చిన్నప్ప దేవర్​ తన ఆరాధ్య దైవం మురుగన్​ వేషాన్ని బేబీ శ్రీదేవిచేత వేయించి తుణైవన్​ సినిమాలో నటింపజేశారు. బాలనటి దశ దాటిన తరువాత శ్రీదేవి తమిళ, మలయాళ భాషల్లో తన వయస్సు కంటే పెద్దగా  కథానాయికగా వేషాలు వేసి మెప్పించారు. 

సూపర్​ సక్సెస్​ హీరోయిన్​గా..

శ్రీదేవికి యుక్త వయస్సు వచ్చాక ‘పదహారేళ్ల వయసు’ తెలుగు సినిమాతో పాపులర్​ అయ్యారు. ఈ సినిమాను మొదట తమిళంలో 16 వయదినిలే అనే పేరుతో తీశారు. దీనిలో శ్రీదేవితోపాటు కమల్​హాసన్, రజినీకాంత్ నటించారు. శ్రీదేవి నటించేటప్పుడు తొలి టేక్​ ఉత్తమ టేక్​ అని దర్శకులు, టెక్నీషియన్లు అనేకమంది చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె ఏకసంథాగ్రహి. ఆమెను సినిమాల్లో నటించేందుకు ఆ పరమేశ్వరి భూమిమీదకు పంపించి ఉండవచ్చును అనిపిస్తుంది.

శ్రీదేవి తెలుగులో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ముందడుగు, జస్టిస్​ చౌదరి, దేవత, అడవి సింహాలు, వజ్రాయుధం, ఎస్పీ పరశురాం, శ్రీరంగనీతులు, కంచు కాగడా, ఖైదీ రుద్రయ్య ఇలా ఎన్ని విజయవంతమైన చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఆమె నటించిన చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్లుగా సలీం, తార, సరోజ, హిందీ సినిమాల్లో సురేశ్​భట్, కమల్, విజయ్​ఆస్కర్, సరోజ్​ఖాన్​ నృత్యరీతులు అందించారు. శ్రీదేవి నటించిన చాలా చిత్రాలకు కాస్ట్యూమ్స్​ డిజైన్​ చేసినవారు ఆమె పర్సనల్​ కాస్ట్యూమర్​ బాబూరావు, కొండయ్యతోపాటు శ్రీదేవి చెల్లెలు శ్రీలత, మనీశ్​ మల్హోత్ర ప్రధానంగా ఉన్నారు.
 
శ్రీదేవి తన చెల్లి శ్రీలత నిర్మాతగా శ్రీలత క్రియేషన్స్​ బేనర్​పై తను హీరోయిన్​గా మెగాస్టార్​ చిరంజీవి హీరోగా, ఎ కోదండరామిరెడ్డి దర్శకుడిగా ‘వజ్రాల దొంగ’ అనే  వర్కింగ్​ టైటిల్​తో 1989లో పాట చిత్రీకరణతో సినిమా మొదలుపెట్టారు. ‘అందం చందం అంతో ఇంతో దేహి..’ అనేది ఈ పాటకు పల్లవి.  ముహూర్తం షాట్​కు ఎంజీ రామచంద్రన్​ వచ్చి శ్రీదేవిని, శ్రీలతను ఆశీర్వదించారు. అయితే పాటను తీశాక ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది. 

మేటి కథానాయకి..

హిందీ సినీ నిర్మాత బోనీకపూర్​ను 1996వ సంవత్సరంలో శ్రీదేవి పెండ్లి చేసుకున్నారు. హిందీలో శక్తి, రన్, బేవఫా సినిమాలను శ్రీదేవి నిర్మాతగా తీశారు. నిర్మాతగా తీసిన ఈ సినిమాల్లో ఆమె నటించలేదు. తెలుగు అంత:పురం చిత్రకథకి ఆధారం. బేవఫా కథ తెలుగు సినిమా అభినందన చిత్ర కథను పోలి ఉంటుంది. శ్రీదేవి కథానాయికగా మలయాళంలో 16 సినిమాలు, తమిళంలో 49, తెలుగులో 72, హిందీలో 63, కన్నడంలో ఒక సినిమా చేశారు. మొత్తం శ్రీదేవి 201 సినిమాల్లో నటించారు. శ్రీదేవి తన మాతృభాష తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించడం విశేషం. శ్రీదేవి 2018వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన తుదిశ్వాస విడిచారు.

దుబాయిలో ఆమె మరణించారు. భౌతికంగా శ్రీదేవి లేకపోయినా ఆమె మనకు అందించిన మనోహరమైన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషల్లో నిర్మించిన చలన చిత్రాలు మరపురాని మధుర స్మృతిగా నిలిచారు. ఆమె సినిమాలను ఇప్పటికీ యూట్యూబ్​లు, టీవీల్లో అభిమానులు చూస్తుంటారు. యూట్యూబ్​లో కామెంట్స్ చూస్తే శ్రీదేవి పట్ల ప్రేక్షక లోకానికి ఎంతటి ఆరాధనా భావం ఉందో  తేటతెల్లం అవుతుంది. శ్రీదేవి ఆమె అభిమానులకు ‘దేవత’, అనురాగ దేవత’.