కొందరిని చూస్తే మన అనే ఫీలింగ్ వస్తుంది. సుహాసిని విషయంలోనూ అంతే. ఆమెది మన భాష కాదంటే ఏ తెలుగు ప్రేక్షకుడూ ఒప్పుకోడు. తమిళనాట పుట్టినా తెలుగువారికి అంతగా అభిమాన నటి అయ్యారామె. ఇప్పటికీ అడపా దడపా ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంటారు. తన నటనతో అందరినీ కట్టిపడేస్తుంటారు. ఇవాళ తన పుట్టినరోజు. ఈ సందర్భంగా సుహాసిని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
నాన్న, బాబాయ్ అడుగు జాడల్లో..
1961లో మద్రాస్‌లోని పరమకుడిలో ఆగస్ట్ 15న జన్మించారు సుహాసిని. నటుడు చారు హాసన్ ఆమె తండ్రి. కమల్ హాసన్ తనకి చిన్నాన్న. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరగడంతో తన మనసు కూడా సినిమా వైపే లాగింది. అక్క నందిని డాక్టర్ అయినా, చెల్లెలు సుభాషిణి ఇంగ్లిష్ లిటరేట్ అయినా సుహాసిని మాత్రం సినిమా రంగాన్నే ఎంచుకున్నారు. సుహాసిని తాతగారైన శ్రీనివాసన్ ఒక క్రిమినల్ లాయర్. చాలా ఆధునిక భావాలు కలవారు. నాన్న, బాబాయ్ అడుగు జాడల్లో నడవమని ఆయనే సుహాసినిని ఎంకరేజ్ చేశారు. దాంతో ఇంటర్ పూర్తయ్యాక ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారామె. అశోక్ కుమార్‌కి కెమెరా అసిస్టెంట్‌గా వర్క్ చేశారు. చాలామంది టాప్ హీరోయిన్ల దగ్గర మేకప్ ఆర్టిస్టుగానూ చేశారు. ఆ తర్వాతే నటిగా మారాలని నిర్ణయించుకున్నారు.
తెలుగు మూవీస్‌కి చాలా ఇంపార్టెన్స్..
నటిగా సుహాసిని మొదటి చిత్రం ‘నెంజతే కిల్లతే’. మమ్ముట్టి హీరోగా నటించిన ‘కూడెవిడె’ మూవీతో మలయాళంలో అడుగుపెట్టారు. కన్నడలోనూ చాలా సినిమాలు చేశారు. విష్ణువర్థన్, ఆమెది హిట్ పెయిర్ అని చెప్పుకునేవారు. ఇక తెలుగులో భారతీరాజా తీసిన ‘కొత్త జీవితాలు’ మూవీతో జర్నీ స్టార్ట్ చేశారు. ఎక్కువ సినిమాలు చేసింది తమిళ, తెలుగు భాషల్లోనే. సౌత్‌లో అన్ని భాషల స్టార్ హీరోలతోనూ నటించారు సుహాసిని. తెలుగులో చిరంజీవి, శోభన్ బాబు లాంటి హీరోలతో చాలా హిట్ మూవీస్ చేశారు. ముక్కుపుడక, స్వాతి, చాలెంజ్, మంగమ్మగారి మనవడు, ముద్దుల మనవరాలు, లాయర్ సుమాసిని, స్రవంతి, సిరివెన్నెల, సంసారం ఒక చదరంగం, ఆఖరి పోరాటం, చంటబ్బాయి, అమ్మ, అక్కమొగుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి సినిమాలున్నాయి తన ఖాతాలో. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తెలుగు మూవీస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎగిరే పావురమా, ఊయల, మనసిచ్చి చూడు, నువ్వు నాకు నచ్చావ్, రాఖీ, లీడర్, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ చేశారు సుహాసిని. త్వరలో సత్యదేవ్, తమన్నాల ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వందల సినిమాలు చేసిన అనుభవంతో..
హిందీలో ‘వెయిటింగ్’ అనే మూవీలో కీలక పాత్ర పోషించారు సుహాసిని. నసీరుద్దీన్ షా, కల్కి కొచ్చిన్ నటించిన ఈ మూవీ కమర్షియల్‌గా అంత సక్సెస్ కాకపోయినా విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ‘స్టంబుల్’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. వందల సినిమాలు చేసిన అనుభవంతో మెగాఫోన్ కూడా పట్టారు సుహాసిని. ముందుగా దూరదర్శన్ కోసం ‘పెణ్’ అనే మినీ సిరీస్‌ను తీశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన సొంత కథ, కథనంతో ‘ఇందిర’ సినిమాని తీశారు. అరవింద్ స్వామి హీరోగా నటించిన ఈ చిత్రంలో సుహాసిని పెదనాన్న చంద్రహాసన్ కూతురు అను హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘స్వయంవరం’ అనే షార్ట్ టెలివిజన్ ఫిల్మ్ ను తెరకెక్కించారు సుహాసిని. అమెజాన్ ప్రైమ్ కోసం ‘కాఫీ.. ఎనీ ఒన్’ అనే సెగ్మెంట్‌ని కూడా తీశారు.
ఎన్నో అవార్డులు..
తన ఫస్ట్ మూవీ ‘నెంజతే కిల్లతే’తోనే తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు సుహాసిని. రెండు సార్లు కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ‘సింధుభైరవి’ చిత్రానికి నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. క్రాంతి కుమార్ తీసిన ‘స్వాతి’ చిత్రానికి ఉత్తమనటిగా, ‘నువ్వు నాకు నచ్చావ్’లోని పాత్రకి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారాలు పొందారు. ‘స్వాతి’ చిత్రంతో పాటు మూడు కన్నడ చిత్రాలకు గాను నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు గెల్చుకున్నారు. కన్నడ మూవీ ‘సచిన్’కి గాను సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు దక్కింది. 1997లో దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్నారామె. ఆయన తీసిన కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. తన భర్త స్టార్ట్ చేసిన ‘మద్రాస్ టాకీస్’ నిర్మాణ సంస్థను కూడా సుహాసినియే చూసుకుంటున్నారు. వీరికి నందన్ అనే కొడుకు ఉన్నాడు.
సేవానిరతి గల మంచి మనిషిగా..
సుహాసిని టెలివిజన్ ఫీల్డ్ లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఆల్రెడీ నాలుగైదు షోస్ కు హోస్ట్ గా వ్యవహరించారు. 2015లో గ్రాండ్ డచ్చీ ఆఫ్ లగ్జెంబర్గ్ గా హానరరీ కాన్సుల్ గా అపాయింట్ అయ్యారు సుహాసిని. అయిదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారామె. ‘నామ్’ పేరుతో ఒక ఫౌండేషన్‌ని స్థాపించి ఒంటరి మహిళలకు చేయూతనిస్తున్నారు. ఎక్కడ ఏ చారిటబుల్ ఈవెంట్ జరిగినా తప్పకుండా హాజరవుతారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో తనవంతు సాయాన్ని అందిస్తారు. నటిగా, దర్శకురాలిగా, గ్రేట్ ఫ్యామిలీకి వారసురాలిగా, ఓ లెజెండరీ డైరెక్టర్ కి భార్యగా, ఎన్ని వ్యవహారాలైనా ఒంటిచేత్తో చక్కబెట్టగల తెలివైన మహిళగా, సేవానిరతి గల మంచి మనిషిగా నిరంతరం కాంప్లిమెంట్స్ అందుకుంటూనే ఉంటారు సుహాసిని. ఆమెని తలచుకోగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన నవ్వు. అది ఎప్పుడూ ఆమె పెదాలను వదిలిపోదు. ప్రేక్షకుల మనసులనూ వదిలిపెట్టదు. ఆవిడ నిండు నూరేళ్లూ ఇలా నవ్వుతూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ సుహాసినికి జన్మదిన శుభాకాంక్షలు.