రాజకీయాలకు సినీ గ్లామర్ కొత్తేమీ కాదు. సినిమా రంగంలో రాణించిన చాలా మంది స్టార్లు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలకు కాస్త ఎక్కువగా సినీగ్లామర్ తోడైంది. ఇప్పటికే హేమా మాలిని, కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, నవనీత్ కౌర్, రచనా బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ప్రముఖ నటి వర్షా ప్రియదర్శినికి అధికార బీజేడీ టికెట్ ఇచ్చింది.
బర్చానా అసెంబ్లీ సెగ్మెంట్‌కు అభ్యర్థిగా వర్ష పేరును ఆ పార్టీ చీఫ్ సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆమె బీజేడీలో చేరారు. వర్ష ప్రియదర్శిని 1984 ఆగస్టు 7న ఒడిశాలోని కటక్‌లో జన్మించింది. ఆమె 2001 నుండి సినిమాల్లో నటిస్తుంది. 39 ఏళ్ల వర్ష ప్రియదర్శిని ఒడిశాలో బాగా పాపులర్. యువతలో ఆమె ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి.
వర్షా ప్రియదర్శిని సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా చురుకుగా ఉంటుంది. వర్షా ఇప్పటి వరకు ఏడు బెంగాలీ చిత్రాలతో పాటు 24 ఒడియా చిత్రాలలో నటించింది. ఈమె సినీ నిర్మాత అనుభవ్ మొహంతీని 2014లో వివాహం చేసుకుంది. 2023 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అనుభవ్ మొహంతీ కూడా బీజేడీ నుంచి 2019లో ఎంపీగా గెలిచారు. ఆయన 3 వారల క్రితం బీజేపీలో చేరారు.
147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేడీ ఇప్పటివరకు 135 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అటు21 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేడీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రెండు స్థానాల్లో బరిలో నిలిచారు . కాగా 2000 మార్చి నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.