- దుబారాను తగ్గించి, ఆదాయం పెంచడంపై ఫోకస్
- గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన
- ఆరు గ్యారెంటీలు, రైతు సంక్షేమానికి పెద్దపీట
- కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు: వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ఫుల్ బడ్జెట్ రెడీ అవుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకుంటున్నది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024–25 పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అంకెలు పెద్దగా చూపడం కంటే.. ఉన్న వాస్తవాలనే బడ్జెట్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దుబారా, అనవసర ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా కేటాయింపులు చేయనుంది. ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు పెంచనున్నారు. రైతులకు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, చేయూత పెన్షన్లు, మహిళా సంఘాలు, ఉపకార వేతనాలు, గ్రామ పంచాయతీలు, కల్యాణ లక్ష్మిలాంటి వాటికి సరిపోను నిధులు కేటాయించనున్నారు.
అదే టైంలో ఎంత అయితే రాబడి వస్తుందో.. అంతే స్థాయిలో ఖర్చులకు పరిమితం అయ్యేలా బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలపై ఆర్థిక శాఖ రివ్యూలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన ప్రభుత్వం, ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్లో రూ.2.76 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లతో పెట్టే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
అప్పులు తగ్గించి.. ఆదాయంపైనే ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతి అప్పులకు వెళ్లదలుచుకోవడం లేదు. ఆదాయంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వంటి వాటిపై ఫోకస్ పెట్టారు. అందులో లీకులను అరికట్టి.. ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్న వాటికి సర్కారు చెక్ పెట్టింది. దీంతో గతంతో చూస్తే ప్రతినెలా యావరేజ్‌గా రాష్ట్ర రాబడి రూ.1000 కోట్లు పెరిగింది. బహిరంగ భూముల విలువలకు అనుగణంగా రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ వాల్యూను సవరించే పనిలో సర్కారు ఉన్నది.
దీంతో ప్రతిఏటా కనీసం రూ.5 వేల కోట్లు అదనంగా ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నది. ఇక కమర్షియల్ ట్యాక్స్‌లో పక్కాగా జీఎస్టీ రిటర్న్స్ఉండేలా చూస్తున్నారు. జీఎస్టీ రీఫండ్స్, వసూళ్లపై లీకేజీలు అరికట్టడంతో ఏకంగా రూ.500 కోట్ల మేర ఇన్కమ్ పెరిగింది. మైనింగ్ విషయంలోనూ ఇసుక ఆదాయంలో మూడు నెలల్లో రూ.150 కోట్ల మేర పెరిగింది. స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్స్లోనూ గత రెండు నెలలుగా రూ.50 కోట్ల చొప్పున అదనంగా ఆదాయం వస్తోంది. ఇక పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకుండా తనఖా పెట్టడం, లీజులకు ఇవ్వడం ద్వారా మరింత ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నది.
ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పరిష్కరించడంపైనా దృష్టి పెట్టింది. ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 20 వేల కోట్ల పైనే పెంచుకునేలా ముందుకు వెళ్తోంది. దీంతో బడ్జెట్లోనే ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అప్పుల బదులు ఆదాయం పెంచుకోగలిగితే గత సర్కార్ చేసిన భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. అందులోనూ ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల నుంచే లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎంలో రూ.60 వేల కోట్ల మేర అప్పులను ప్రతిపాదించగా.. అంతకు మించకుండానే రుణాలు తీసుకోనుంది.
సంక్షేమానికే ఎక్కువ ఖర్చు
కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. వివిధ శాఖలు, స్కీమ్లవారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్లను వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే, కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నిర్ణయించింది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోచ్చని సమాచారం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి కొంతవరకు అంచనాలు మారవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఈ నెల 22న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్రపద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు. ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారెంటీలకు ఉజ్జాయింపుగా రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
రైతు భరోసాకు రూ. 15 వేల కోట్లు, పింఛన్లకు ఉద్దేశించిన చేయూత పథకానికి రూ.14,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెలనెలా రూ.2500 ఆర్థికసాయం అందించే మహాలక్ష్మి పథకానికి రూ. 7,230 కోట్లు ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ. 4,084 కోట్లు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు ప్రతిపాదించారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1,065 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించారు. ఉద్యోగ నియామకాల కోసం రూ. వెయ్యి కోట్లు, రైతు రుణ మాఫీ కోసం రూ.10 వేల కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారెంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ సిద్ధం చేస్తున్నారు.