యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణతాపడ పనులకు శ్రీకారం

యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణతాపడ పనులకు శ్రీకారం
  • బంగారు తాపడానికి 60 కిలోల బంగారం
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిపై దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం పనులకు ముందడుగు పడింది. 2025 ఫిబ్రవరిలోపు   పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వెల్లడించారు.  స్వర్ణ తాపడం కోసం  సిద్ధంగా ఉన్న రాగి దేవతా విగ్రహాలను బుధవారం చెన్నైకి తరలించారు.   ఈ సందర్భంగా  బీర్ల అయిలయ్య  మీడియాతో మాట్లాడారు.  బంగారు తాపడం తయారీ, బిగింపు పనులకు కలిపి మొత్తం రూ.3.90 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఖర్చు మొత్తం దేవస్థానమే భరిస్తుందని  తెలిపారు. వచ్చే ఏడాది మార్చి ఒకటి నుండి నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయని,  ఆలోపే  తాపడాన్ని అమరుస్తామని చెప్పారు.  స్వర్ణతాపడ తయారీ కోసం దేవస్థాన నిధులు, భక్తుల నుంచి వచ్చిన విరాళాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. మొత్తం  60 కిలోల బంగారం అవసరం అవుతుందన్నారు.   ఈ కార్యక్రమంలో  చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు పాల్గొన్నారు.