IND vs BAN 2024: క్రికెట్ చరిత్రలోనే అదొక అద్భుతం.. పంత్ కంబ్యాక్ సెంచరీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్

IND vs BAN 2024: క్రికెట్ చరిత్రలోనే అదొక అద్భుతం.. పంత్ కంబ్యాక్ సెంచరీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ వికెట్ కీపర్.. రీ ఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 124 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ తర్వాత పంత్ ఈ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు.. 4 సిక్సర్లున్నాయి. టెస్ట్ కెరీర్ లో ఇది రిషబ్ కు ఇది ఆరో సెంచరీ. ఈ సెంచరీతో పంత్ పై ప్రశంసలు వర్షం కురుస్తుంది.  
 
క్రికెట్ లో అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకరైన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. క్రికెట్ చరిత్రలోనే పంత్ సెంచరీ గ్రేటెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తనకు, పంత్ కు మధ్య ఉన్న పోలికలపై స్పందించాడు.' పంత్ తనకంటే దూకుడుగా ఆడతాడని.. ఎలాంటి భయం లేకుండా అతడు బ్యాటింగ్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుందని ఈ ఆసీస్ దిగ్గజం తెలిపాడు. పంత్ కు ఎప్పుడు వేగం తగ్గించాలో.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని చెప్పాడు. 

రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30 న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి  పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. 2024 లో ఐపీఎల్ తో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20, వన్డే, టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.