పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోను : మదన్​ మోహన్​రావు

ఎల్లారెడ్డి(లింగంపేట), వెలుగు: నియోజకవర్గంలోని ప్రజలకు ఆఫీసర్లు, లీడర్ల నుంచి ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఎల్లారెడ్డి క్యాంపు ఆఫీస్​లో విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానన్నారు. ప్రతీ మండల కేంద్రంలో 15 రోజులకోసారి అన్ని శాఖల ఆఫీసర్లతో ప్రజల సమస్యలపై రివ్యూ ​మీటింగులు ఏర్పాటు చేసి, అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలోని గడపగడపకు తిరిగానని, పేద ప్రజల ఇబ్బందులను స్వయంగా చూశానన్నారు. ఎందరో పేదలు ఇండ్లు లేక పూరిగుడిసెల్లో నివాసముంటున్నారని, ముందుగా వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా  నెలకు రూపాయి జీతం తీసుకొని పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ ​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలోని  ప్రతి మండల కేంద్రంలో తాము చేపట్టిన అబివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు  తెలిపారు.