న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్ సంస్థ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు అదానీ గ్రూప్ మంగళవారం తెలిపింది. ఈ డీల్ విలువ రూ.8,100 కోట్లని వెల్లడించింది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ ఓరియంట్ సిమెంట్చైర్మన్ సీకే బిర్లాతోపాటు ఇన్వెస్టర్లకు చెందిన వాటాలను రూ. 3,791 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అదనంగా 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.
దక్షిణాదిలో రెండు, పశ్చిమ భారతదేశంలో ఒక సిమెంట్ ప్లాంట్లను ఓరియంట్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం అంబుజాకు ఇది రెండవ కొనుగోలు. ఓరియంట్ సిమెంట్తన చేతికి రావడం వల్ల అంబుజా సామర్థ్యం 97.4 మిలియన్ టన్నులకు చేరుతుంది. అదానీ గ్రూప్ దీనిని 2028 నాటికి సంవత్సరానికి 140 మిలియన్ టన్నులకు పెంచే పనిలో ఉంది. మార్కెట్ లీడర్ అల్ట్రాటెక్ ప్రస్తుత సామర్థ్యం 149.5 మిలియన్ టన్నుల కంటే ఇది తక్కువే. అదానీ గ్రూప్ ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేయగా, గతేడాది డిసెంబర్‌లో సౌరాష్ట్రకు చెందిన సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రూ.5,185 కోట్లకు దక్కించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అల్ట్రాటెక్ సిమెంట్ జులైలో ఇండియా సిమెంట్స్‌ను రూ.3,945 కోట్లకు కొనుగోలు చేసింది.