మేడిన్ @అదానీ డ్రోన్స్.. సైన్యానికి అప్పగించే ముందే కూలిపోయింది

ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ సహకారంతో అదానీ డిఫెన్స్ నిర్మించిన దృష్టి 10 డ్రోన్ ట్రయల్స్‌లోనే కూలిపోయింది. భారత నావికాదళానికి డెలివరీ చేయడానికి ముందు జరిగిన ట్రయల్స్‌లో ఈ ఘటన జరిగింది.

దృష్టి 10 స్టార్‌లైనర్‌ డ్రోన్‌ గుజరాత్‌లోని పోర్‌బందర్‌ తీరంలో ట్రయల్స్‌లో ఉండగా కూలిపోయినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. డ్రోన్ గాలిలో ఉండగా కమాండ్ కోల్పోయి నీటిలో మునిగిపోయింది. డ్రోన్ ఇంకా సైన్యంలో ప్రవేశపెట్టబడలేదు కనుక భారత నావికాదళానికి ఎటువంటి నష్టం లేదని వారు తెలిపారు. ఈ డ్రోన్ ఖరీదు దాదాపు రూ. 140 కోట్లు. ట్రయల్స్‌లోనే కూలిపోయింది కనుక అదానీ డ్రోన్స్  విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ALSO READ | Naval Ships: సముద్ర రక్షణలో గ్లోబల్ లీడర్‌.. సైన్యంలోకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు

భారత నావికాదళం అత్యవసర సేకరణ యంత్రాంగం కింద రెండు దృష్టి-10 UAVల కోసం ఆర్డర్ చేసింది. ఇప్పటికే ఒకటి సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. దృష్టి 10 స్టార్‌లైనర్‌ కు ఇంటెలిజెన్స్‌, నిఘా (ఐఎస్‌ఆర్‌) సామర్థ్యాలున్నాయి. గాల్లో 36 గంటలపాటు ఎగరగలదు. 450 కిలోల పేలోడ్‌ను తీసుకెళుతుంది. అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగలదు.