- సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 1,741 కోట్లు ఆదాయం రూ.23,196 కోట్లు
న్యూఢిల్లీ: అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ లాభం భారీగా పెరిగింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. విమానాశ్రయాలు, కొత్త ఇంధన యూనిట్లు, బొగ్గు వ్యాపారం నుంచి భారీగా ఆదాయం రావడమే కారణం. దీంతో ప్రస్తుత 2024–-25 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో రూ. 1,741 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 228 కోట్లతో పోలిస్తే లాభం 663 శాతం పెరిగిందని కంపెనీ ప్రకటన తెలిపింది. ఇబిటా 46 శాతం పెరిగి రూ.4,354 కోట్లకు చేరుకోగా, ఆదాయం 15 శాతం పెరిగి రూ.23,196 కోట్లకు చేరుకుంది.
బొగ్గు వ్యాపారం మినహా, సంస్థ ఇతర ప్రధాన వ్యాపారాలు భారీ వృద్ధిని సాధించాయి. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ -- సోలార్ మాడ్యూల్ విండ్ టర్బైన్ తయారీకి సంబంధించిన యూనిట్ -- పన్నుకు ముందు లాభం 78 శాతం జంప్ చేసి రూ. 1,121 కోట్లకు చేరుకుంది. విమానాశ్రయ వ్యాపార ఆదాయం 31 శాతం పెరిగి రూ.744 కోట్లకు ఎగిసింది. మైనింగ్ సేవల ఇబిటా 65 శాతం పెరిగి రూ.400 కోట్లకు చేరుకుంది. కోల్ ట్రేడింగ్ యూనిట్ ఆదాయాలు రూ.2,063 కోట్ల నుంచి రూ.1,916 కోట్లకు పడిపోయాయి. ఏఈఎల్ ఆర్నెళ్లలో రూ. 8,654 కోట్ల ఇబిటా సాధించింది. సంస్థ ఈ నెలలో అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.4,200 కోట్లను సమీకరించింది.
పెట్టుబడులను పెంచుతాం: గౌతమ్ అదానీ
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) దేశం ఆర్థిక వృద్ధికి ప్రధానమైన లాజిస్టిక్స్, ఇంధన రం గాలలో పెట్టుబడి పెట్టడంపై దృష్టి సారిస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. ఏఎన్ఐఎల్కు చెందిన మూడు గిగా స్కేల్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లలో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ల అమలుతోపాటు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. డేటా సెంటర్లు, రోడ్లు, మెటల్స్, మెటీరియల్స్‌లో వేగవంతమైన వృద్ధిని సాధిస్తామని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సోలార్ మాడ్యూల్ అమ్మకాలు 2 గిగావాట్లు దాటాయని, ఎగుమతులు 64 శాతం పెరిగాయని సంస్థ తెలిపింది. నోయిడా హైదరాబాద్ డేటా కేంద్రాల నిర్మాణం పూర్తి కావస్తున్నదని, పూణే సెంటర్ నిర్మాణం 38 శాతం పూర్తయిందని తెలిపింది. ఇదిలా ఉంటే, స్థూల రుణం మార్చి 2024 చివరి నాటికి రూ. 50,124 కోట్ల నుంచి 52 శాతం పెరిగి రూ. 63,855 కోట్లకు చేరుకుంది.