న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2030లో రిటైర్ అవుతానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్లు కాగా, 70 ఏళ్లు వచ్చాక పదవుల నుంచి తప్పుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాధ్యతలను తన కుమారులకు, బంధువులకు ఇస్తానని బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కు వెల్లడించారు. అదానీ కొడుకులు కరణ్, జీత్‌కు.. వీళ్ల కజిన్స్ ప్రణవ్, సాగర్‌కు -ఫ్యామిలీ ట్రస్ట్‌పై అధికారాలు వస్తాయి. ఇందుకోసం ఇదివరకే ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. గౌతమ్ అదానీ పెద్ద కొడుకు కరణ్ అదానీ అదానీ పోర్ట్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండగా
చిన్న కుమారుడు జీత్ అదానీ అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ కాగా, సాగర్ అదానీ.. అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రణవ్ లేదా కరణ్‌లలో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తారని సమాచారం. మరోవైపు రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్లేస్‌మెంట్ రూట్ ద్వారా రూ.
8,373.10 కోట్లను సమీకరించినట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) సోమవారం తెలిపింది. ఇది జులై 2015లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుంచి విడిపోయి లిస్ట్ అయింది. క్యాపిటల్ మార్కెట్‌లో కంపెనీకి ఇది మొదటి ఈక్విటీ రైజ్ అని ఏఈఎస్ఎల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.