ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల పిల్లలకు అదానీ గ్రూపు సాయం

 ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల పిల్లలకు అదానీ గ్రూపు సాయం

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‍ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే విషయంపై ఆయన హిందీలో ఒక ట్వీట్‌ చేశారు.

‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఒడిశాలో జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. 1100మందికి పైగా గాయపడ్డారు.  రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. ఆదివారం (జూన్ 4న) సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

https://twitter.com/gautam_adani/status/1665319913790279680