ఒకటి విమానాలను లీజుకిచ్చేందుకు, రెండు సిమెంట్ తయారీకి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీ అంబుజా సిమెంట్స్ కొత్తగా మూడు ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీలను ఏర్పాటు చేసింది. లోటిస్ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రైవేట్ లిమిటెడ్, అంబుజా కాంక్రీట్ నార్త్ ప్రైవేట్ లిమిటెడ్, అంబుజా కాంక్రీట్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఏర్పాటు చేశామని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వివరించింది. ఈ మూడు కంపెనీల్లో లోటిస్ ఐఎఫ్‌ఎస్‌సీ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీస్ సెక్టార్‌కి చెందగా, మిగిలిన రెండు కంపెనీలు సిమెంట్ సెక్టార్‌కు చెందినవి. లోటిస్ ఐఎఫ్‌ఎస్‌సీ ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ.1.7 కోట్లని అంబుజా సిమెంట్స్ పేర్కొంది. ఫేస్ వాల్యూ రూ. 10 తో కంపెనీని 17 లక్షల షేర్లుగా వేరు చేశారు.
ఇదే విధంగా అంబుజా కాంక్రీట్ నార్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ. లక్ష. షేర్ల ఫేస్ వాల్యూ రూ.10. అంబుజా కాంక్రీట్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ. లక్ష. ఈ కంపెనీ షేర్ల ఫేస్ వాల్యూ కూడా రూ.10. విమానాలను లీజుకు ఇచ్చే బిజినెస్‌లో లోటిస్ ఐఎఫ్‌ఎస్‌సీ పనిచేస్తుందని అంబుజా సిమెంట్స్ పేర్కొంది. మిగిలిన రెండు సబ్సిడరీ కంపెనీలు సిమెంట్, ఆర్‌ఎంఎక్స్, ఇతర బై ప్రొడక్ట్‌లను తయారు చేస్తాయి. అంబుజా సిమెంట్ షేర్లు శుక్రవారం సెషన్‌లో 1.72 శాతం నష్టపోయి రూ.419 దగ్గర క్లోజయ్యాయి. గత ఐదు సెషన్లలో 6 శాతం నష్టపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 శాతం క్రాష్ అయ్యాయి.