- సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందజేసిన గౌతమ్ అదానీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం అందజేసింది. కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందంటూ అదానీ హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రభుత్వం నియమించింది.