న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికాలో అవినీతి అభియోగాలు వెల్లువెత్తడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమ మధ్య అదానీ ఇష్యూపై డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో అదానీపై వచ్చిన ఆరోపణలపై బుధవారం (నవంబర్ 27) అదానీ గ్రూప్ స్పందించింది. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈవో వినీత్ జైన్‌లపై అమెరికా అధికారులు మోపిన లంచం ఆరోపణలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఖండించింది.
అదానీ అవినీతి ఆరోపణలకు సంబంధించి వార్త పత్రికల్లో వచ్చిన కథనాలకు.. నవంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గ్రీన్ ఎనర్జీ క్లారిటీ ఇచ్చింది. అదానీ, సాగర్, వినీత్ జైన్‌కు వ్యతిరేకంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సిపిఎ) ఉల్లంఘనలకు సంబంధించిన మీడియా నివేదికలను పూర్తిగా తప్పుడు కథనాలుగా అదానీ గ్రీన్ ఎనర్జీ పేర్కొంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్‌లపై అమెరికా సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. వీరిపై లంచం, అవినీతి కేసుల్లో కాదని అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది.
ALSO READ : అదానీ ఇష్యూపై దద్దరిల్లిన పార్లమెంట్.. నవంబర్ 28కి రాజ్య సభ వాయిదా
ఎఫ్‌సీపీఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో వీరి ప్రస్తావన లేదని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎక్స్చేంచ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అదానీ భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఎటువంటి రుజువు లేదని.. కేవలం లంచాలు ఇవ్వజూపారని మాత్రమే వారు క్లెయిమ్ చేశారని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. అదానీ అవినీతి ఆరోపణలపై పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.