
న్యూఢిల్లీ: హోల్సిమ్ ద్వారా ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లో వాటాలను దక్కించుకోవడం ద్వారా అదానీ గ్రూపు ఇండియాలోనే రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించింది. ఆసియాలోని అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, దాని అనుబంధ ఏసీసీలో 63.19 % వాటాను దక్కించుకున్నారు. ఈ డీల్ విలువ 10.5 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని హోల్సిమ్ ఏజీ సిమెంట్ వ్యాపారాలలో అదానీ గ్రూపునకు మెజారిటీ వాటా దక్కింది. అంబుజా, ఏసీసీలకు సంవత్సరానికి కనీసం 70 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్‌కు 120 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. అదానీ కుటుంబం ఆఫ్‌షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అంబుజా, ఏసీసీలో హోల్సిమ్ లిమిటెడ్ మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకుంది. అంబుజాకు ఏసీసీలో 50.05% వాటా ఉండగా, హోల్సిమ్కు డైరెక్ట్‌గా ఏసీసీలో 4.48 % వాటా ఉంది.